రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ABN , First Publish Date - 2020-05-30T11:09:24+05:30 IST

జిల్లాలో ఇసుక మాఫియా ఆగడా లు మరింత మితిమీరిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ఆగని ఇసుక అక్రమ రవాణా.. అడ్డువచ్చిన వారిపై దాడులు  

పక్షం రోజుల్లోనే ఇద్దరు వీఆర్‌ఏలపై దాడులు

తాజాగా సజ్జన్‌పల్లిలో వీఆర్‌ఏపై దాడి చేసిన ఇసుక కాంట్రాక్టర్‌లు  

గతంలోనూ అడ్డుపడ్డ కాందార్‌ను ఇసుకట్రాక్టర్‌తో హతమార్చిన వైనం   

అభివృద్ధి పేరిట అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు

జిల్లా సరిహద్దులను దాటించేస్తున్న వైనం   

‘మామూలు’గానే తీసుకుంటున్న అధికారులు 


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి) మే 29: జిల్లాలో ఇసుక మాఫియా ఆగడా లు మరింత మితిమీరిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఇసుక మాఫియా ఇటీవల కాలంలో అక్రమ రవాణాకు తెరలే పుతూ వివాదాలకు కారణమవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో మద్నూర్‌, బీబీపేట మండ లంలోని ఐదుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. దీంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ శాఖలు పలు చర్యలు చేపడుతోంది.


ఇందులో భాగంగా ఇసుకను తరలించే వాహ నాలను అడ్డుకునే ప్రయత్నంలో రెవెన్యూ సిబ్బందిపై ఇసుక మాఫి యా దౌర్జన్యానికి పాల్పడుతూ దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లింగంపేట మండలం సజ్జన్‌పల్లిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న వీఆర్‌ఏపై ఇసుక కాంట్రాక్టర్‌లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన కలకలం రేపుతోంది. ఇలా పక్షం రోజుల్లోనే జిల్లాలో ఇద్దరు కాందారులపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడడంపై రెవెన్యూ వర్గాలు తీవ్రంగా మండిపడుతు న్నాయి. ఇలాంటి సంఘటనలు జిల్లాలో గతంలో జరిగినప్పటికీ ఇసుక మాఫియాపై అఽధికారులు చర్యలు చేపట్టకుండా ‘మామూలు’ గానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైన ఉన్నతా ధికారులు అడ్డుకోవడంతో పాటు ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.


ఆగని ఇసుక అక్రమ దందా

జిల్లాలో ఇసుకాసురులు రోజు రోజుకూ పెట్రేగి పోతున్నారు. నదీ పరివాహాక ప్రాంతాల్లో ఇసుక ను తోడేస్తున్నారు. కనుచూపు మేర ఎక్కడ ఇసు క కనబడినా సరే అక్రమ రవాణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా చేస్తే క్షమించబోమని, ఎవరై న అక్రమ రవాణ చేస్తే పీడీ యాక్టు కేసులు సైతం నమోదు చేస్తా మని హెచ్చరిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వ కారణ ంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నియమ నిబంధనలను విధించినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.


రాత్రి వేళ్లలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీ ల్లో తరలిస్తూ ఇసుకాసురులు కాసులు దండుకుంటున్నారు. కొంత మంది అక్రమార్కులు అభివృద్ధి పేరిట ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. ఒకే వే బిల్లుపై పదుల సంఖ్యలో టిప్పర్లలో, ట్రాక్టర్ల లో ఇసుకను తరలిస్తున్నారు. జిల్లా సరిహద్దులో చెక్‌ పోస్టులు లేకపో వడం ఇసుక కాంట్రాక్టర్లకు కలిసివస్తోంది. జిల్లా నుంచి  ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులైన మహారాష్ట్ర, కర్నాటక రాష్టాలకు తర లిస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్‌, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, జుక్కల్‌, నిజాంసాగర్‌, బీబీపేట్‌, మాచారెడ్డి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారె డ్డి మండలాల్లో అర్ధరాత్రి వేళ్లలో ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


ఒక వేల ఇసుక తరలింపునకు అనుమతి తీసుకుంటున్నప్పటికీ పరిమితికి మించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడంతో ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం నుంచి కాకుండా మద్నూర్‌లోని సిర్‌పూర్‌ వాగు, బీబీపేటలోని తుజాల్‌పూర్‌ వాగు, లింగంపేట్‌లోని పెద్దవాగు, మాచా రెడ్డిలోని పల్వంచ వాగు, నాగిరెడ్డిపేటలోని గోలిలింగాల వాగులోంచి ఇసుకను తోడేస్తునప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరి స్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక అనుమతులు లేకపో యినా ఇసుక రవాణా కొనసాగడంపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 


దాడులకు ఎగబడుతున్నారు

ఇసుక అక్రమ రవాణ చేస్తుంటే అడ్డువచ్చిన ప్రజలపై, చివరకు అధికారులు, సిబ్బందిపై కూడా ఇసుకాసురులు దాడులు చేయడానికి వెనుకాడడం లేదు. ఇసుక అక్రమ రవాణ చేస్తున్న సమయంలో ట్రాక్టర్‌ ముందు తమ మనుషులతో నిఘా ఏర్పాటు చేసుకొని ఎవరై న అడ్డగిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించడం, దాడులు చేయడం పరపాటిగా జరుగుతునే ఉంది. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, బీర్కూ ర్‌, మద్నూర్‌ మండలాల్లో గతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారులకు అడ్డువచ్చిన వారిని అదే ఇసుక టిప్పర్లతో, లారీలతో ఎక్కించి హతమార్చిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం పిట్లం మండలం కారేగామ్‌ కాందార్‌ సాయిలు మృతి సంఘటనే ఇందుకు నిదర్శనం.


ఇటీవల బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మంజీర పరివాహక రెవె న్యూ ఉన్నతాధికారులపై ఇసుకాసురులు రాళ్ల దాడికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. గత పది రోజుల కిందట జుక్కల్‌ మండలం లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అడ్డుకున్న వీఆర్‌ఏపై ఇసుకాసురులు దాడులు చేశారు. దీంతో బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగి పట్టుమని 10 రోజు లు గడవకముందే తాజాగా లింగంపేట్‌ మండలం సజ్జన్‌పల్లి గ్రామ శివారులోని పెద్దవాగు గుండా ఇసుక కాంట్రాక్టర్‌లు అక్రమంగా ట్రాక్ట ర్ల ద్వారా ఇసుకను రాత్రి వేళలో తరలిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు స్థానిక వీఆర్‌ఏ పెద్దోల ఆంజనేయులు ట్రాక్టర్‌లను అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్‌ యజమాని వీఆర్‌ఏపై దాడి చేయడంతో తీవ్ర గాయా లపాలయ్యాడు. 


ఇసుక అక్రమ రవాణాకు సహకరించే సిబ్బందిపై వేటు

జిల్లాలో ఇటీవల కాలంలో ఇసుక వివాదం రాజుకుంటుంది. అధికా ర వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఇసుకలొల్లి నెలకొంటుంది. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా ఉన్నతాధికారులు సైతం తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఇసుక వివాదాల్లో ఉంటున్న పోలీసు సిబ్బందిపై ఆ శాఖ సీరియస్‌గా తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణాకు సహకరిం చారనే ఆరోపణలతో ఇటీవల ఐదుగురు పోలీసు సిబ్బందితో పాటు పలువురు హోంగార్డులపై పోలీసుశాఖ క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసింది. మద్నూర్‌లో ఇసుక అక్రమ రవాణాకు సహకరించారన్న ఆరోపణలు రావడంతో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ శ్వేతారెడ్డి ఆదేశించింది.


ఈ సంఘటన గడిచి వారం రోజులు గడవకముందే బీబీపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై సమా చారం ఇవ్వలేదని స్థానిక హెడ్‌ కానిస్టే బుల్‌ను, హోంగార్డులకు నోటీ సులు జారీ చేశారు. ఇలా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సహకరి ంచే ఆయా ప్రభుత్వశాఖలోని సిబ్బందిపై అధికారులపై ఉన్నతాధికా రులు కఠినంగా వ్యవహరిస్తూ వారిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-05-30T11:09:24+05:30 IST