ఆరు వేలు కాదు.. 13 వేలు!

ABN , First Publish Date - 2021-12-05T15:23:41+05:30 IST

చిన్నపిల్లాడు. బుడి బుడి నడకల వయసు. ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకుని సమీపంలోని పాఠశాలకు వెళ్లిపోయేవాడు. పక్కనే పాఠశాల ఉండడంతో తల్లిదండ్రులు చేర్చేవారు. పిల్లలు తమకు తాముగా వెళ్లిపోయేవారు. అయితే ఇకపై క్రమంగా పాఠశాలలు..

ఆరు వేలు కాదు.. 13 వేలు!

‘విలీనం’తో మాయమయ్యే బడుల సంఖ్య ఇది

మొదట్లో 250 మీటర్లు.. ఆపై కి.మీ. పరిధిలో

ఇప్పుడు ఈ 2 పరిధుల్లోనూ విలీనమేనట!

ఈ ఏడాది నుంచే అమలుకు సర్కారు సిద్ధం

రహస్యంగా చేరిపోయిన ఆదేశాలు!

ఇప్పటికే 3,4,5 క్లాస్‌ పిల్లలకు గదులు లేవు

ఆ సమస్య తీరకుండానే స్కూళ్లపై కొత్త కత్తి


(అమరావతి, ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లాడు. బుడి బుడి నడకల వయసు. ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకుని సమీపంలోని పాఠశాలకు వెళ్లిపోయేవాడు. పక్కనే పాఠశాల ఉండడంతో తల్లిదండ్రులు చేర్చేవారు. పిల్లలు తమకు తాముగా వెళ్లిపోయేవారు. అయితే ఇకపై క్రమంగా పాఠశాలలు దూరమైపోనున్నాయి. ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియలో వేగాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారుల సమావేశాల్లో రహస్యంగా ఈ విషయం చెప్పినట్లు సమాచారం.


ఈ ఏడాది ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను మాత్రం విలీనం చేయాలని, వచ్చే ఏడాది ఒక కిలోమీటరు లోపువి చేయాలని ప్రభుత్వం అక్టోబరు నెలలో నిర్ణయించింది. ఆ మేరకు ఒకటినుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు, నాలుగు, ఐదో తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. ఆ దూరం పరిధిలో ఉన్నవి విలీనం చేయడంతో సుమారు ఆరు వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు ఈ విలీనాన్ని కిలోమీటరు పరిధిలో ఉన్నవాటికీ వర్తింపచేయాలని నిర్ణయించారు.


ఈ ఏడాదినుంచే కిలోమీటరు దూరంలోనివీ చేసేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే సుమారు 13వేల పాఠశాలల్లోని 3,4,5 తరగతులు విలీనం అయిపోతాయి. వచ్చే ఏడాది ఈ దూరాన్ని మరింత పెంచి రెండుకిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలనూ విలీనం చేసేసేందుకు అంతర్గత కార్యాచరణ సిద్ధం చేసేశారని తెలుస్తోంది. అంటే చిన్నపిల్లాడు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం ఒక కిలోమీటరు నుంచి రెండు, మూడు కిలోమీటర్లు నడవాల్సిందే! ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితులూ ఏర్పడవచ్చు.


డ్రాపవుట్లు పెరిగితే..

దూరం పెరిగేకొద్దీ బడిమీద ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దూరం పెరిగేకొద్దీ తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. పాఠశాలలు దగ్గరిలో ఉంటే గబుక్కున వారిని అక్కడికి పంపేసి...పనులకు వెళ్లిపోయే పేద ప్రజలకు ఇప్పుడిక ఇబ్బందే. పాఠశాలలు దూరం కావడంతో తమ పిల్లలను ఉదయం దించాలి. సాయంత్రం మళ్లీ తీసుకువచ్చేందుకు వెళ్లాలి. ఇదంతా పనులకు వెళ్లే తల్లిదండ్రులకు సమస్యగా మారి.. విద్యాభ్యాసం నుంచే దూరం చేసే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 34వేల ప్రాథమిక పాఠశాలలుండగా...వాటిలో అత్యధిక శాతాన్ని దశలవారీగా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయనున్నారని సమాచారం. 


కాలే పెనం మీంచి సరాసరీ పొయ్యిలోకే..

వాస్తవానికి తొలి దశ విలీనంలోనే అనేక సమస్యలు ఎదురయ్యాయి. విద్యావ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందా అన్నంత పరిస్థితి ఏర్పడింది. ఉన్నత పాఠశాలకు 250మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు తరలివచ్చేశాయి. ఆయా తరగతుల్లో ఉన్న విద్యార్థులూ వచ్చేశారు. కానీ ఆయా తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు మాత్రం రాలేదు. ఎందుకంటే వచ్చేందుకు ఉపాధ్యాయులే లేరు. మరోవైపు ఇక్కడ ఉన్నత పాఠశాలల్లోనూ కొత్తగా వచ్చిన తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుల్లేరు. అప్పటివరకు ఉన్న తరగతులు, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే అరకొరగా ఉండడంతో...ఇక కొత్త తరగతులు, కొత్తగా విలీనమైన విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల పాఠశాలల్లో ఈ సమస్య ఏర్పడింది. అదే సమయంలో కొత్తగా వచ్చిన తరగతులు, విద్యార్థులకు ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు కూడా లేవు. 


ఏకోపాధ్యాయుడు...బహు ప్రదర్శనలు

ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడన్నా ఉండాలన్నది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్‌. కానీ ఆ డిమాండ్‌ సంగతి దేవుడెరుగు...విలీన ప్రక్రియను ముందుకుతీసుకెళ్తే ఏకంగా ఒక పాఠశాల మొత్తానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి రావచ్చు. అతనే టీచరు, అతనే హెడ్‌మాస్టరు, అతనే మధ్యాహ్న భోజనం పర్యవేక్షకుడు, అతనే పాఠశాల విద్యా శాఖ పెట్టిన పలు యాప్‌లకు ఫొటోలు పంపాల్సిన వ్యక్తి. అంటే ఒక ఉపాధ్యాయుడు అష్టావధానం చేయాల్సిందే. రెండు తరగతులకు అన్ని అంశాలు బోధించడంతో పాటు ఇతర పనులనూ చక్కబెట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2021-12-05T15:23:41+05:30 IST