మిషన్‌.. ‘తుస్‌’

ABN , First Publish Date - 2021-10-13T06:47:52+05:30 IST

జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలు తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మధ్య డెల్టా కింద కోనసీమ, తూర్పుడెల్టా కింద ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు కాలువల ద్వారా గోదావరి నీరు ప్రవహిస్తుంది.

మిషన్‌.. ‘తుస్‌’
కడియం మీదుగా వెళ్లే గోదావరి కాలువలో చెత్తా చెదారం పోస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

జిల్లాలో ‘మిషన్‌ క్లీన్‌ గోదావరి’ ప్రాజెక్టు అటకెక్కినట్టే

చేతకాక రెండేళ్లకే తుస్సుమనిపించిన రాష్ట్ర ప్రభుత్వం

గోదావరి కాలువలను కాలుష్యం బారి నుంచి కాపాడతామని అప్పట్లో హడావుడి

గతేడాది రెండుసార్లు సీఎం సమీక్ష.. కాలువలను శుభ్రం చేసి పార్కులుగా మార్చాలని ఆదేశాలు

ఆనక పూర్తిగా పట్టించుకోని వైనం.. నిధులు లేక, రాక అధికారులూ గప్‌చుప్‌

జిల్లాలో గోదావరి కాలువలు 175 చోట్ల కాలుష్య కాసారాలుగా మారినట్టు గతంలో గుర్తింపు

ఎక్కడికక్కడే కోళ్లు, రొయ్యలు, నివాస, వాణిజ్య వ్యర్థాలన్నీ యథేచ్ఛగా పారబోత

అనేక పరిశ్రమల వృథా కాలుష్య జలాలూ కాలువల్లోకే గుట్టుగా మళ్లింపు

కాకినాడ, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట సహా వందలాది గ్రామాలకు ఈ నీళ్లే దిక్కు

జిల్లాలో కాలుష్య కాసారాలుగా మారిన గోదావరి కాలువలను  తిరిగి పరిశుభ్రంగా మార్చుతామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం తీరా కార్యాచరణలో కాడి వదిలేసింది. ‘మిషన్‌ క్లీన్‌గోదావరి’ పేరుతో హడావుడి చేసి చివరకు పట్టించుకోవడమే మానేసింది. ఈ ప్రాజెక్టును సీఎం జగన్‌ ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. ఇంతవరకు చిన్న పని కూడా మొదలవలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ  పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలో హడావుడి చేసి ఆనక అదేంటో కూడా తెలియదన్నట్టు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా అంతకంతకూ గోదావరి కాలువలు చెత్తాచెదారం, వ్యర్థజలాలతో నిండిపోయి భయానకంగా మారాయి. జిల్లాలో 175 చోట్ల కాలువలు తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా మారినట్టు సర్వేలో గుర్తించారు.  వీటిని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, కాలువ వెంబడి ప్రాంతాలను పార్కులుగా చేస్తామన్న  ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయింది. ఇటు పంచాయతీలు, మున్సిపాల్టీలు మాత్రం ఇప్పటికీ చెత్తంతా తెచ్చి కాలువల్లో పోస్తుండడం విశేషం.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలు తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మధ్య డెల్టా కింద కోనసీమ, తూర్పుడెల్టా కింద ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు కాలువల ద్వారా గోదావరి నీరు ప్రవహిస్తుంది. ఈ నీళ్లు లక్షల ఎకరాల సాగుతోపాటు తాగునీటికి కూడా ఆధారం. ఈ నేపథ్యంలో వీటిని ఎక్కడికక్కడ సురక్షితంగా ఉంచితేనే ఆ నీళ్లు తాగే ప్రజల ఆరోగ్యానికి ధీమా. దీనికి విరుద్ధంగా జిల్లావ్యాప్తంగా గోదావరి కాలువలు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. వీటి వెంబడి ఉన్న వందలాది గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లల్లో ఉండే చెత్తాచెదారం అంతా తెచ్చి కాలువల్లో పారబోస్తున్నారు. గృహనిర్మాణ వ్యర్థాలు, చికెన్‌, మద్యం దుకాణాల మొదలు క్షవరశాలల వరకు.. వందలాది వాణిజ్య దుకాణాల్లో వాడిపడేసిన వస్తువులను కాలువల్లో వదిలేస్తున్నారు. ఇదికాకుండా కడియం నుంచి కాకినాడ వరకు, ఆత్రేయపురం నుంచి అమలాపురం వరకు కాలువలకు సమీపంలో వందలాది కోళ్లఫారాలున్నాయి. వీటిల్లోని వందల టన్నుల వ్యర్థాలను డ్రమ్ముల్లో తెచ్చి డంపింగ్‌ చేస్తున్నారు. అనపర్తి, కడియం, బిక్కవోలు, ద్వారపూడి, సామర్లకోట, కాకినాడ, కోనసీమ పరిధిలోని కాలువల్లో ఈ తరహా వ్యర్థాలు భయంకరంగా కలిపేస్తున్నారు. కోనసీమ పరిధిలో రొయ్యల చెరువుల్లో వాడిన నీటిని పైపులతో గోదావరి కాలువలకు మళ్లిస్తున్నారు. ఇందులో అనేకరకాల హానికారక రసాయనాలు కలిసి ఉంటాయని తెలిసినా లెక్కచేయ డం లేదు. ఇలా ఎక్కడికక్కడ కాలువలు విషమయం అవుతుండగా, ఆ నీటిని తాగే మూగజీవాలు తరచూ మృత్యువాత పడుతున్నాయి. అటు పంచాయతీల పరిధిలోని మురుగుకాలువల నీటినీ కాలువల్లోకే తరలిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే రాజమహేంద్రవరం నుంచి సామర్లకోట వరకు కాలువలకు సమీపంలో అనేక రకాల పరిశ్రమలున్నాయి. వీటిలో వినియోగించగా వచ్చే కాలుష్య జలాలను శుద్ధిచేసి భూమిలోకి వెళ్లేలా చేయాలి. కానీ ఖర్చు సాకుతో గుట్టుగా పైపుల్లోంచి గోదావరి కాలువల్లోకి కలిపేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గోదావరి కాలువలు జిల్లాలో చెత్త డంపింగ్‌ యార్డుల్లా మారాయి. ఈనేపథ్యంలో ఈ కాలువలన్నింటినీ పరిశుభ్రంగా మార్చే పేరుతో రాష్ట్రప్రభుత్వం ‘మిషన్‌ క్లీన్‌ గోదావరి’ ప్రాజెక్టును 2019 సెప్టెంబరులో ప్రకటించింది. దీనికి చైర్మన్‌గా సీఎం జగన్‌, ఇతర కీలక సభ్యులుగా జిల్లా కలెక్టర్‌, జలవనరులశాఖ అధికారులు కూడా ఉన్నారు. ప్రాజెక్టులో భాగంగా గోదావరి కాలువల వెంబడి చెత్తను తొలగించి శాశ్వతంగా ఫెన్సింగ్‌, చెత్తవేయకుండా ఏర్పాట్లు, కాలుష్య జలాలు కలవకుండా శుద్ధిచేయడానికి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గతేడాది సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కాలువల వెంబడి పచ్చదనాన్ని పెంచాలని, వీటిని అందంగా వాకింగ్‌ట్రాక్‌లుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.100 కోట్ల వరకు ఖర్చయ్యే ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉండదన్నారు. ఇప్పటికీ రెండేళ్లవుతున్నా చిన్న పని కూడా జరగలేదు సరికదా ఎక్కడికక్కడ కాలువలు ఇంకా చెత్తాచెదారంతోనే నిండిఉన్నాయి. ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ ప్రాజెక్టు పనులు అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. వాస్తవానికి ప్రాజెక్టు ప్రకటించిన కొన్నాళ్లకు జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో 175 చోట్ల గోదావరి కాలువల నీళ్లు విషతుల్యంగా మారినట్టు నీటిపారుదలశాఖ గుర్తించింది. కాలువల వెంబడి వ్యర్థాలపై డ్రోన్లతో పంచాయతీలు, మున్సిపాల్టీలు సర్వే చేశాయి. అత్యధికంగా కోనసీమలో కోళ్లు, రొయ్యల వ్యర్థాలు, కడియం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, సామర్లకోట పరిధిలో 68 చోట్ల కాలువల్లో నీళ్లు వ్యర్థాలతో విషపూరితంగా మారినట్లు నిర్థా రించారు. కొన్నిచోట్ల పరిశ్రమల నుంచి కాలుష్య జలాలు నేరుగా కలిసిపోతున్నట్టు తేల్చారు. ఏయే కాలువల వద్ద వ్యర్థాల రీసైక్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలో ప్రతిపాదించారు. అలాగే ధవళేశ్వరం నుంచి జీవీకే విద్యుత్‌ కేంద్రం వరకు పైలట్‌ పద్ధతిలో కాలువలను పరిశుభ్రంగా మార్చి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి ఓ కన్సల్టెన్సీ సంస్థతో అంచనాలు వేయించారు. నిధులు లేక ఈ పని కూడా అటకెక్కింది. అటు కలెక్టర్‌ కూడా మిషన్‌ క్లీన్‌ గోదావరి గురించి మర్చిపోవడంతో ప్రాజెక్టే మూలనపడింది.



Updated Date - 2021-10-13T06:47:52+05:30 IST