మెసెంజరే సూత్రధారి, పాత్రధారి

ABN , First Publish Date - 2021-09-03T17:00:00+05:30 IST

కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో..

మెసెంజరే సూత్రధారి, పాత్రధారి

ఆలీఖాన్‌  దంపతులపై బీవోబీ ఆర్‌ఎం ఫిర్యాదు

ఖాళీ అయిపోతున్న డిపాజిట్ల నగదు, తాకట్టు నగలు


కలికిరి: కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎట్టకేలకూ అధికారులు ముందుకొచ్చారు. బీవోబీలో రూ.26 లక్షలా 95 వేలు మెసెంజరు ఆలీఖాన్‌ దారి మళ్ళించాడని శుక్రవారం రీజనల్‌ మేనేజర్‌ ఎం.వి.శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలీఖాన్‌, అతని భార్య చాందినీ పేర్లతో వున్న ఉమ్మడి ఖాతా 16510100019927కు ఈ మొత్తం మళ్ళించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 16 వరకూ జరిగిన లావాదేవీల్లో ఈ మొత్తం పక్కదారి పట్టినట్లు గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు ఉద్యోగులు రామచంద్రుడు, జయకృష్ణ, ఈలూ, ఈశ్వరన్‌లను సస్పెండు చేశామని, మరి కొంతమందిని బదిలీ చేశామని చెప్పారు.


కేవలం మూడున్నర నెలల వ్యవధిలో మాత్రమే రూ.26.95 లక్షలు వెలుగులోకి వచ్చినట్లు ఈ ఫిర్యాదు మేరకు అధికారికంగా వెల్లడయ్యింది.అదీ ఒక్క ఖాతాకు సంబంధించినది మాత్రమే చూపారు. ఇక ఆలీఖాన్‌ మొత్తం 8 ఖాతాల ద్వారా నిధులు మళ్ళించినట్లు ఇప్పటికే గుర్తించారు. వీటిలో కూడా కొన్ని ఆయన స్వంత ఖాతాలు కాగా మరి కొన్ని బంధువర్గాలకు చెందినవి. మూడున్నర నెలల వరకే అదీ ఒక్క ఖాతాకు సంబంధించిన మొత్తమే ఇంత వుంటే ఇక 8 ఖాతాలకు సంబంధించి ఐదేళ్ళ లెక్కలు తవ్వి తీస్తే అక్రమాలు ఎక్కడికి చేరుకుంటాయోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


రూ.కోటిన్నర దాటిన డ్వాక్రా నిధుల స్వాహా

డ్వాక్రా గ్రూపు లెక్కల పరిశీలన గురువారం కూడా కొనసాగింది. రికార్డుల పరిశీలన కోసం వచ్చిన మహిళా సభ్యులతో వెలుగు కార్యాలయం కిక్కిరిసిపోయింది. గురువారానికి మొత్తం 224 గ్రూపుల్లో 97 గ్రూపుల లెక్కలను పరిశీలించారు.ఇందులో 48 గ్రూపుల్లో ఆలీఖాన్‌ అక్రమాలు రూ. కోటి 54 లక్షలకు చేరుకున్నాయి. మరో 127 గ్రూపుల్లో లెక్కలను పరిశీలించాల్సి వుంది. గురువారం కూడా ఏరియా కోఆర్డినేటర్‌ రూతూ, ఏపీఎం సుబ్బమణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గ్రూపుల లెక్కలు పరిశీలించాయి. మరోవైపు డిపాజిట్లను వాపసు తీసుకోవడానికి, తాకట్టు నుంచి బంగారాన్ని విడిపించుకోవడానికి ఖాతాదారులు బుధవారం పోటెత్తారు. వందల మంది ఆతృతగా సాయంకాలం వరకూ క్యూలో వున్నారు. తాకట్టు నుంచి బంగారం చేతికి రాగానే పలువురు ఊపిరి పీల్చుకున్నారు. వివాదాలు లేని డిపాజిట్లను కూడా ఖాతాదారుల కోరికతో వాపసు చేశారు. ఇక బ్యాంకులో సైతం ఖాతాల వారీగా జరిగిన లావాదేవీలను పరిశీలించడంలో ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రధానంగా వ్యక్తిగత ఖాతాలు, డిపాజిట్లు, బంగారు తాకట్టు రుణాల చెల్లింపులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరో వైపు నకిలీ రశీదులకు వేసిన నకిలీ సీళ్ళు ఎక్కడ తయారు చేయించారన్న దానిపై కూపీ లాగుతున్నట్లు తెలిసింది. 


మా బంగారం చేతికొచ్చినందుకు ఆనందంగా వుంది

తాకట్టు పెట్టిన బంగారం చేతికొచ్చినందుకు ఆనందంగా వుందని గురువారం బంగారు విడిపించుకున్న మాధవి, రుక్మిణమ్మ, సల్మా, పర్వీన్‌ పేర్కొన్నారు. బ్యాంకులో జరిగిన విషయం తెలిసి వారం రోజులుగా తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు.బ్యాంకులో భద్రతపై అనుమానాలు తలెత్తినందునే రూ. 7 లక్షలు చెల్లించి  బంగారాన్ని విడిపించుకుపోతున్నట్లు బరిణేపల్లెకు చెందిన శ్రీనివాసులు చెప్పారు. 

Updated Date - 2021-09-03T17:00:00+05:30 IST