1,000 కోట్లు ఏం చేస్తారు..?

ABN , First Publish Date - 2021-04-11T06:45:55+05:30 IST

హైదరాబాద్‌ మెట్రో అభివృద్ధి వైపు మరింత వేగంగా పరుగులు పెట్టనుంది.

1,000 కోట్లు ఏం చేస్తారు..?

బడ్జెట్‌లో మెట్రోకు కేటాయించిన  నిధులపై సర్వత్రా ఆసక్తి 

 పాతబస్తీలో మిగిలిన మార్గాన్ని పూర్తి చేస్తారా..

  రెండో దశ పనులు మొదలు పెడుతారా..!

  ఎటూ తేల్చని ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు 

 ఎయిర్‌పోర్టు మెట్రోకు ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో అభివృద్ధి వైపు మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మెట్రోకు రూ. 1,000 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో  ఇప్పటికే డీపీర్‌ సిద్ధమైన రెండో దశ పనులను ప్రారంభిస్తారా, మొదటిదశలో మిగిలిన పాతబస్తీ పనులు పూర్తి చేస్తారా అన్నది మాత్రం తేలడం లేదు. మెట్రో మెదటి దశ కారిడార్‌-3లో జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ (15కిలోమీటర్లు) పనుల్లో పాతబస్తీ మార్గం ఇంకా 5.5 కిలోమీటర్లు మిగిలి ఉంది. ఈ పనులు సుమారు రూ.1,200 కోట్లు అవసరముంటుందని అధికారులు ప్రభుత్వానికి గతంలో వివరించారు. ఆస్తుల సేకరణ కు మరో రూ. 300 కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో ఈ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ, ఆస్తుల సేకరణ సమస్యగా మారే అవకాశముందని మెట్రో వర్గాలు వెల్లడిస్తున్నాయి. 


ఎయిర్‌పోర్టు పనులకే మొగ్గు..

మెట్రోను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో మెట్రో సేవలను అందుబాటులోకి తీస్తుకొస్తామని సీఎం కేసీఆర్‌ గతం లో ప్రకటించారు.  మెట్రో మొదటిదశ కారిడార్‌-3 మార్గానికి అనుసంధానంగా మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ ఉంటుందని చెబుతున్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంట 31 కిలోమీటర్ల మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ కోసం పెద్దగా భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉండదని, మెట్రోస్టేషన్ల నిర్మాణానికే 60-70 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని  చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో కొంతవరకైనా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-04-11T06:45:55+05:30 IST