మెట్రో.. మూడో ‘‘సారీ’’ తరచూ ఆగిపోతున్న రైలు

ABN , First Publish Date - 2021-01-27T06:39:22+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో

మెట్రో.. మూడో ‘‘సారీ’’  తరచూ ఆగిపోతున్న రైలు


వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

జనవరిలో ఇప్పటి వరకు మూడుసార్లు 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సౌకర్యవంతమైన రవాణాను అందిస్తున్న మెట్రో రైళ్లు కొన్ని నెలలుగా మొరాయిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆగిపోతున్న రైళ్లతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అత్యవసర పనులకు వెళ్తున్న సందర్భాల్లో అలా జరుగుతుండడంతో అసహనానికి లోనవుతున్నారు. గతంలో ఏడాదికోసారి సాంకేతిక లోపాలు తలెత్తిన పరిస్థితి చూడగా.. ప్రస్తుతం వారంలో రెండు, మూడుసార్లు ఆగిపోతున్నాయి. పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థ అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. 

ఈ నెలలో..

- జనవరి 5న అసెంబ్లీ - అమీర్‌పేట మార్గంలో వెళ్తున్న రైలు ఉదయం 10.55 గంటలకు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో నడుస్తున్న రైళ్లు దాదాపు అర గంటపాటు నిలిచిపోయాయి. ఉదయం పూట సమస్య తలెత్తడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

 - జనవరి 20న అమీర్‌పేట-హైటెక్‌సిటీ వైపు వెళ్తున్న మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌-5 మెట్రోస్టేషన్‌లో రైలు నిలిచింది. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది.. ఆగిపోయిన రైలును నాగోల్‌ మెట్రో డిపోకు తరలించేందుకు మరో ఇంజన్‌ను రప్పించారు. 

- జనవరి 26న మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో వెళ్తున్న రైలు సాయంత్రం 4.30 గంటలకు గాంధీభవన్‌ స్టేషన్‌లో నిలిచిపోయింది. అంతకుముందు మూసారాంబాగ్‌ స్టేషన్‌లో 15 నిమిషాలు ఆగిపోయినట్లు తెలిసింది. నాగోలు స్టేషన్‌ డేటా కంట్రోల్‌ సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతికలోపంతోనే దాదాపు అన్ని రూట్లలో రైళ్లు 10 నుంచి 20 నిమిషాలు ఆగిపోయినట్లు తెలిసింది.

Updated Date - 2021-01-27T06:39:22+05:30 IST