మెట్రోలో సైకిల్.. ఆరు స్టేషన్లలో అనుమతి!

ABN , First Publish Date - 2020-11-19T01:24:58+05:30 IST

నగరాల్లో వేగంగా ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది మెట్రో. ఈ ట్రైన్స్‌లో మనం చేరుకోవాల్సిన గమ్యాలకు క్షణాల్లో చేరుకోవచ్చు.

మెట్రోలో సైకిల్.. ఆరు స్టేషన్లలో అనుమతి!

ఇంటర్నెట్ డెస్క్: నగరాల్లో వేగంగా ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది మెట్రో. ఈ ట్రైన్స్‌లో మనం చేరుకోవాల్సిన గమ్యాలకు క్షణాల్లో చేరుకోవచ్చు. అందుకే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోచి తదితర సిటీల్లో ప్రారంభించిన మెట్రో సేవలు లాభదాయకంగా నడుస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో.. అప్పుడప్పుడు మనుషులు కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా సైకిళ్లు తీసుకొచ్చేస్తే? అదేంటి మెట్రో ఎక్కుతూ సైకిళ్లేంటి? అనుకుంటున్నారా? కేరళలో ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.


కోచిలో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా సైక్లింగ్ చేస్తున్నారు. మరీ ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే తప్ప సైకిళ్లే వాడుతున్నారు. మరి అలాంటి వాళ్లు మెట్రో ఎక్కాలంటే సైకిల్‌ ఏం చేయాలి? పార్కింగ్‌లో పెట్టి వెళ్తే.. ట్రైన్ దిగాక జర్నీ పరిస్థితేంటి? ఈ ఆలోచనే వచ్చింది కోచిలోని మెట్రో యాజమాన్యానికి. అంతే ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మెట్రోలో సైకిళ్లను అనుమతించాలనేదే ఈ తాజా నిర్ణయం. దీనికోసం అదనంగా ఎలాంటి చార్జీ వసూలు చేయడం లేదు.



తొలి విడతలో భాగంగా చంగంపుజ పార్క్ స్టేషన్, పలారివట్టామ్ స్టేషన్, ఎర్నాకులం సౌత్ స్టేషన్, మహారాజ కాలేజ్ స్టేషన్, ఎలాంకులం మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు సైకిళ్లు తీసుకొని రైలు ఎక్కేందుకు, దిగేందుకు అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ స్టేషన్లలో సైకిళ్లను రైలు వద్దకు తీసుకెళ్లడం కోసం లిఫ్టును ఉపయోగించేందుకు కూడా అనుమతిస్తారట. రైలు వెనుక భాగంలో అలాగే ముందు భాగంలో సైకిళ్లు పెట్టడానికి ప్రత్యేకంగా కొంత ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా సైకిళ్లు తీసుకెళ్లడానికి డిమాండ్ పెరిగితే కచ్చితంగా ఆ స్టేషన్లలో కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు.



‘‘కోచి మొత్తం సైకిల్స్‌పై చుట్టేయండి. చంగంపుజ పార్క్, పలారివట్టామ్, ఎర్నాకులం సౌత్, మహారాజ కాలేజ్, ఎలాంకులం మెట్రో స్టేషన్లలో సైకిల్స్ తీసుకొని రైళ్లు ఎక్కొచ్చు, దిగొచ్చు. దీనికోసం లిఫ్టులు కూడా ఉపయోగించుకొండి. ఆయా స్టేషన్లలో సిబ్బంది కూడా సైక్లిస్టులకు సహకరిస్తారు’’ అని కోచి మెట్రో రైల్ సంస్థ ట్వీట్ చేసింది. కోచి చుట్టు పక్కల ప్రాంతాల్లో సైక్లిస్టులు బాగా పెరిగారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నారట. మిగతా ప్రాంతాల్లో కూడా డిమాండ్ వస్తే.. అన్ని మెట్రో స్టేషన్లలో సైకిల్స్‌కు అనుమతిస్తామని చెప్పారు.



ఇలా మెట్రో రైల్లోకి సైకిళ్లను అనుమతించడం పట్ల సైక్లిస్టులు హర్షం వ్యక్తంచేశారు. గతంలో ఎక్కడా ఇటువంటిది జరగలేదని వారు చెప్పారు. అయితే సైక్లింగ్‌ను ఇష్టపడే వారికి కోచి మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగా నచ్చుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రజల ఆయురారోగ్యాల కోసం నాన్-మోటారైజ్‌డ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు ప్రచారం కల్పించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారట. దీనిలో భాగంగానే సైకిళ్లకు అనుమతిచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా మెట్రోలో ఇలా సైకిళ్లను అనుమతించడం వల్ల చాలా మందికి లాభదాయకంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.


Updated Date - 2020-11-19T01:24:58+05:30 IST