లే అవుట్లుగా ‘మెట్రో’ భూములు

ABN , First Publish Date - 2021-01-17T09:46:10+05:30 IST

కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్థిక నష్టాలను అధిగమించే ప్రయత్నంలో.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) తన పరిధిలోని ఖాళీ

లే అవుట్లుగా ‘మెట్రో’ భూములు

ప్లాట్లుగా ఉప్పల్‌ భగాయత్‌లోని 42 ఎకరాలు..

200, 300, 600 గజాల చొప్పున అమ్మకం

వెంచర్లు చేస్తున్న హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థ

హెచ్‌ఎండీఏ లే అవుట్‌ ప్రకారం విక్రయం

రూ.600 నుంచి రూ.1000 కోట్ల సమీకరణ

రెండో దశ ప్రాజెక్టు పనుల కోసమేనా...?


హైదరాబాద్‌ సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్థిక నష్టాలను అధిగమించే ప్రయత్నంలో.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) తన పరిధిలోని ఖాళీ స్థలాలను విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం కేటాయించిన భూములను వెంచర్లు చేసి అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ప్రి కాస్ట్‌ యార్డుగా పేరొందిన ఉప్పల్‌ భగాయత్‌ లోని 42 ఎకరాలను.. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) లే అవుట్‌ నిబంధనల ప్రకారం 200, 300, 600 చదరపు గజాల ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ఈ -వేలం నిర్వహిస్తోంది.


సంస్థాగత పనులకు వినియోగం

మెట్రో రైలు మొదటి దశ అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉప్పల్‌లో 142 ఎకరాలు కేటాయించింది. ఈ భూముల్లో వంద ఎకరాల వరకు సంస్థాగత పనులకు వినియోగించారు. నాగోలు డిపో, కమాండ్‌ కంట్రోల్‌, కార్పొరేట్‌ కార్యాలయానికి కొంత స్థలాన్ని వాడుకున్నారు. 42 ఎకరాలను ప్రి కాస్ట్‌ యూనిట్‌గా తీసుకుని.. వివిధ ప్రాంతాల్లో కొనసాగే మెట్రో రైల్‌ కారిడార్‌ పనులకు సంబంధించిన వయాడక్ట్స్‌, స్తంభాల తయారీ చేపట్టారు. ఇంకొంతభాగంలో మొక్కలను పెంచారు. మొదటి దశ పనులు ముగిసిన నేపథ్యంలో.. ఖాళీగా ఉన్న 42 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా అభివృద్ధి చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలు, రెండో దశ పనులకు వాడుకోవాలని  హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఆలోచిస్తోంది.


అందులోభాగంగానే వెంచర్‌ ద్వారా రూ.600 కోట్ల నుంచి రూ.1000 కోట్లను సమకూర్చుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. కాగా, మొదటి దశ పనుల్లో భాగంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఆధ్వర్యంలో స్టేషన్లు, కారిడార్‌ మార్గంలో ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చించారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు సర్వే, డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారీ కూడా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చేపడుతోంది. రెండో దశను ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలోనే చేపడతారా? లేకుంటే ప్రభుత్వమే చేపడుతుందా? అనేది ఇంకా తేలలేదు. అదెలాగున్నా అవసరమైన భూ సేకరణ పూర్తిగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి నిధుల సమీకరణలో భాగంగానే ఉప్పల్‌ భగాయత్‌లోని స్థలాన్ని లే అవుట్‌గా చేసి విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


గత ఏడాది ఆగస్టు నుంచే టెండర్లకు ఆహ్వానం

ప్రి కాస్ట్‌ యూనిట్‌ స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించేందుకు 2020 ఆగస్టు నుంచే హెచ్‌ఎంఆర్‌ఎల్‌ టెండర్లను ఆహ్వానిస్తోంది. నోడల్‌ ఏజెన్సీ ద్వారా తొలి విడతలో 20 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు లక్ష చదరపు గజాలకు ఈ-వేలం నిర్వహిస్తోంది. లే అవుట్లు చేస్తున్న స్థలంలో 40, 60, 100 అడుగుల రోడ్లు వేస్తున్నారు. పచ్చదనం, పార్కులు, తాగునీరు, మురుగు నీటి కనెక్షన్ల పనులను చేపడుతున్నారు.  హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం రోడ్ల కోసం 30 శాతం, ఇతర సౌకర్యాలకు 10 శాతం భూమి పోగా.. నోడల్‌ ఏజెన్సీకి ఈ లేఅవుట్‌లో 55 నుంచి 60 శాతం మధ్య పాట్లు లభించనున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో హెచ్‌ఎండీఏ ప్లాట్లు చేసి ఏ విధంగానైతే విక్రయించిందో.. అదే తరహాలో అమ్మేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఈ లే అవుట్‌ను కమర్షియల్‌ జోన్‌ పరిధిలో ఉండేలా చేస్తున్నారా? నివాస (రెసిడెన్షియల్‌) జోన్‌ పరిధిలో ఉండేలా చేస్తున్నారా? అనేదానిపై స్పష్టత లేదు. మిగిలిన 22 ఎకరాలను రెండో విడతలో అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు వెంచర్‌గా మార్చనున్న 20 ఎకరాలు బఫర్‌ జోన్‌లో లేనందున లేఅవుట్‌ అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని అధికార  వర్గాలు భావిస్తున్నాయి. ఈ లే అవుట్‌లోని స్థలాలు వాణిజ్య, నివాస అవసరాలకు అనువుగా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-01-17T09:46:10+05:30 IST