కేజ్రీవాల్‌కు కేంద్రం భారీ షాక్

ABN , First Publish Date - 2021-08-19T22:34:03+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ

కేజ్రీవాల్‌కు కేంద్రం భారీ షాక్

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం బస్సుల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తునకు  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశించింది.


1,000 లో-ఫ్లోర్ ఎయిర్ కండిషన్డ్ సీఎన్‌జీ బస్సులను కొనేందుకు నిధుల మంజూరుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నియమించిన కమిటీ ఈ వ్యవహారంపై సవివరమైన దర్యాప్తు జరిపించాలని సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో నేరం జరిగిందా? లేదా? అనే అంశాన్ని సీబీఐ ఈ ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకుంటుంది. 


ప్రస్తుతం 311 బస్సులు డీటీసీలో సేవలందిస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి మరో 89 బస్సులు రాబోతున్నట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం ఈ బస్సులను ఆరు నెలల్లోగా డీటీసీకి అందజేయవలసి ఉంది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో కంపెనీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటంతో బస్సుల బట్వాడా ఆలస్యమైంది. 


ఈ బస్సుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆరోపించడంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వివాదం ముదిరింది. 


బస్సుల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం వేధింపుల్లో భాగమేనని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో ఆరోపించింది. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఏర్పాటైన కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీపై రాజకీయ ప్రేరేపిత కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ఢిల్లీ ప్రజలకు కొత్త బస్సులు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని పేర్కొంది. గతంలో కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ ద్వారా వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేసింది. 


ఇదిలావుండగా, లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన కమిటీ ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా పరిశీలించి, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని విధానపరమైన లోపాలు ఉన్నట్లు మాత్రమే చెప్పినట్లు సమాచారం. 


Updated Date - 2021-08-19T22:34:03+05:30 IST