డేంజర్! తల్లి గర్భంలో బయటపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలు! డాక్టర్లు షాక్!

ABN , First Publish Date - 2020-12-23T02:01:39+05:30 IST

ప్లాసెంటాలో ప్లాస్టిక్! డాక్టర్లు షాక్!

డేంజర్! తల్లి గర్భంలో బయటపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలు! డాక్టర్లు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఇందుగలడు అందు లేడు అనే సందేహం వద్దు..అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు..అని మనం భగవతుండి గురించి చెప్పుకుంటూ ఉంటాము. అయితే..ఇది ప్లాస్టిక్ వ్యర్థాలకూ వర్తిస్తుందని తాజాగా తేలిపోయింది! వివిధ రూపాల్లో పర్యావరణాన్ని కమ్మేస్తున్న  ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు మరో షాకింగ్ విషయాన్ని గుర్తించారు. తల్లి గర్భంలో కూడా వారు మైక్రో ప్లాస్టిక్స్‌ను ఉన్నట్టు కనుగొన్నారు. తల్లిని గర్భస్థశిశువుతో కలుపుతూ బిడ్డకు పోషకపదార్థాలు అందించే మావిలో(ప్లాసెంటాలో) మైక్రోప్లాస్టిక్స్‌ను కనిపెట్టారు. ఇటువంటి ఘటన వెలుగు చూడటం వైద్య చరిత్రలో ఇదే తొలిసారి.


అంతేకాకుండా.. శిశువు చుట్టూ రక్షణగా ఉండే పొరలోనూ వీటిని గుర్తించారు. ఈ అతిసూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు(మైక్రోప్లాస్టిక్స్) ఎరుపు, నీలం, నారింజ, రంగుల్లో ఉన్నాయని,  ప్యాకేజింగ్‌కు వాడే ప్లాస్టిక్‌, పెయింట్లు, లేదా కాస్మెటిక్స్ ద్వారా ఇవి గర్భిణుల శరీరంలోకి ప్రవేశించి ఉంటాయని వారు భావిస్తున్నారు. మొత్తం నలుగురు మహిళల్లో ఇవి బయటపడినట్టు తెలుస్తోంది. అయితే ..వారందరూ ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిచ్చారు. మరోవైపు..బిడ్డలు గర్భంలో ఉండగానే వారి శరీరాల్లోకి మైక్రోప్లాస్టిక్స్ ప్రవేశించి ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. దీనికి రుజువులు మాత్రం వారికి ఇప్పటివరకూ లభించలేదు. రోమ్‌లోని శాన్ జియోవానీ క్యాబిలిటా ఆస్పత్రి వైద్యులు ఈ అధ్యనాన్ని చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు..ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. గర్భస్థశిశువు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే ప్లాసెంటాలో ప్లాస్టిక్‌ ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయం అని వైద్యుల బృందం తెలిపింది.


ఏమిటీ మైక్రోప్లాస్టిక్స్..

ఓ మిల్లీమిటరులో వందో వంతు సైజులో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలే మైక్రోప్లాస్టిక్స్‌. వీటితో పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిలుతోంది. వీటిపై వివిధ రకాల హానికారక రసాయనాలు పేరుకుని కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కూ దారితీయచ్చు. అయితే..ఇవి అతి సూక్ష్మమైనవి కావడంతో రక్తప్రవాహం ద్వారా ఇది సులువుగా శరీరంలోని వివిధ భాగాలకు చేరుకోగలవు. ప్లాసెంటాలోకి కూడా ఇదే విధంగా ప్రవేశించి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. వీటి వల్ల శిశువు అనేక దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-12-23T02:01:39+05:30 IST