Hyderabad : అర్ధరాత్రి బుల్లెట్‌ కన్నా వేగంతో కుర్రకారు రేసింగ్‌.. వాట్సాప్‌ ద్వారా బెట్టింగ్‌లు.. నియంత్రణ ఎలా!?

ABN , First Publish Date - 2021-09-14T17:52:57+05:30 IST

ఎల్లో సిగ్నల్‌ నుంచి రెడ్‌ సిగ్నల్‌గా మారడానికి మధ్య ఉన్న ఐదు సెకన్ల వ్యవధిలో..

Hyderabad : అర్ధరాత్రి బుల్లెట్‌ కన్నా వేగంతో కుర్రకారు రేసింగ్‌.. వాట్సాప్‌ ద్వారా బెట్టింగ్‌లు.. నియంత్రణ ఎలా!?

  • బెట్టింగులు, రేసింగ్‌లతో ప్రమాదాలు
  • వాట్సాప్‌లో మెసేజ్‌లు... రోడ్లపై ఫీట్లు
  • బుల్లెట్‌ వేగంతో దూసుకుపోతున్న కుర్రకారు


- ఎల్లో సిగ్నల్‌ నుంచి రెడ్‌ సిగ్నల్‌గా మారడానికి మధ్య ఉన్న ఐదు సెకన్ల వ్యవధిలో బైకును జంప్‌ చేయించి ఎంత దూరం వెళ్తామనేది బెట్టింగ్‌. రెడ్‌ సిగ్నల్‌ పడక ముందే చౌరస్తా దాటేయాలనేది నియమం. ఈ లెక్కలు చూసేందుకు కొంత మంది రోడ్డుపై ఉంటారు. 


- ‘ఫలానా రోడ్డులో బ్రేకు వేయకుండా, గేర్‌ మార్చకుండా గమ్యస్థానాన్ని ఐదు మినిషాల్లో చేరుకుంటా’ అంటూ ఓ రేసర్‌ పోస్టింగ్‌ చేస్తాడు. దీన్ని కొంత మంది సవాలుగా తీసుకుంటారు. ఆయనతో పోటీకి సై అంటూ ముందుకొస్తారు. అంతే.. రేసు మొదలవుతుంది.


- గతంలో మెహదీపట్నంలో ఓ రేసింగ్‌ గ్యాంగ్‌ ఆగడాలు ఇతర వాహనదారులను భయాందోళనలకు గురి చేశాయి. ఆ ఫీట్లను చూసిన వారి ఒళ్లు  జలదరించింది.


- వీకెండ్‌ కాగానే.. బెట్టింగ్‌లు, రేసింగ్‌లతో కొంత మంది యువత భయాందోళలను సృష్టిస్తోంది. బైక్‌పై రయ్యిమంటూ దూసుకెళ్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. నెల రోజుల క్రితం దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కొందరు యువకులు ఇదే విధంగా రచ్చ చేశారు. బైక్‌లపై విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌ : నగరంలో అర్ధరాత్రి బుల్లెట్‌ కన్నా వేగంతో కొందరు రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. వీరికి కళ్లెం వేసేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అడ్డుకట్టపడడం లేదు. ఖరీదైన, సాధారణ బైక్‌లపై వేగంతో, పెద్ద శబ్దం చేసే సైలెన్సర్‌లతో కుర్రకారు దూసుకుపోతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా తామేం తక్కువ తిన్నామా అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రేసింగ్‌లు చేస్తూ రోడ్డు ప్రమాదంలో సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.


బెట్టింగుల్లో రకాలు

- ఒకే టైరుపై ఎంత దూరం ప్రయాణించగలుగుతారనేదీ ఓ స్టంట్‌. ఉదాహరణకు మెహిదీపట్నం, రేతిబౌలి సిగ్నల్‌ నుంచి నానల్‌ నగర్‌ చౌరస్తా వరకు సుమారు 300 మీటర్ల దూరం ఉంది. సిగ్నల్‌ నుంచి ముందు టైరును పూర్తిగా గాల్లో లేపి.. వెనక టైరు మీద వెళ్లాలి. ఈ సిగ్నల్‌ నుంచి ఆ సిగ్నల్‌ వరకు ఒకే టైరుపై ప్రయాణిస్తే గెలిచినట్లు. ఎక్కువ దూరం ప్రయాణించిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. 


- ఐదు కిలోమీటర్ల దూరం రెండు నిముషాల్లో చేరాలంటూ ప్రమాదకరమైన రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. బైకు స్పీడ్‌ గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకూడదని నిర్ణయించుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలకు ఆస్కారమేర్పడుతోంది. 


- కిలోమీటర్‌ సూచి కిందకు రాకుండా కొందరి బెట్టింగ్‌లు ఉంటాయి. వెనక కూర్చున్న వ్యక్తి స్పీడో మీటర్‌ వీడియో రికార్డు చేస్తాడు. ఇందులో కిలోమీటరును మార్కు చేసుకుని ఒక్క సారి 150 కి.మీ. స్పీడు దాటిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తగ్గకుండా ఉండాలి. ఎవరిదైనా మీటర్‌ తగ్గిందంటే ఓడిపోయినట్లే. 10 కి.మీ నుంచి 25 కి.మీ వరకు కూడా ఈ తరహా రేసింగ్‌లు జరుగుతున్నాయి. ఇదంతా నగర శివారు లేదా ట్రాఫిక్‌ అంతగా లేని రోడ్లపై సాగుతాయి. అతివేగం, నిర్లక్ష్యంతో ఒక్కోసారి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా ప్రమాదాల్లో ప్రముఖుల ప్రాణాలు కూడా ఎన్నో గాల్లో కలిశాయి.



వాట్సాప్‌ గ్రూపుల్లో..

వీకెండ్స్‌ రాగానే పబ్‌లకు జంటలుగా వచ్చే యువత వాట్సాప్‌ ద్వారా రేస్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీలింగ్‌, ఫెడలింగ్‌, స్కిడింగ్‌ అంటూ వినూత్నంగా బెట్‌లు పెట్టుకుంటున్నారు. ఇదంతా బయటి వారికి తెలియకుండా కేవలం వాట్సాప్‌ గ్రూపుల ద్వారా స్థలం, సమయం నిర్ణయించుకుంటున్నారు. ఇందుకోసం ఖరీదైన బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువకుడు విదేశాల నుంచి 25 లక్షల విలువ చేసే బైక్‌ను దిగుమతి చేసుకున్నాడు. దానికి నెంబరు ప్లేటు అమర్చుకోవడం నామోషీగా భావించి అలాగే వదిలేశాడు. తనిఖీల్లో పోలీసులకు పట్టుబడడంతో జరిమానా విధించారు.

Updated Date - 2021-09-14T17:52:57+05:30 IST