Abn logo
Nov 20 2020 @ 10:22AM

‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్’ మూవీ రివ్యూ

Kaakateeya

చిత్రం:  మిడిల్ క్లాస్ మెలొడీస్‌

బ్యాన‌ర్‌: భ‌వ్య‌క్రియేష‌న్స్‌

విడుద‌ల‌: అమెజాన్ ప్రైమ్‌

న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, సుర‌భి ప్ర‌భావ‌తి, చైత‌న్య గ‌రిక‌పాటి త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం:  వినోద్ అనంతోజు

నిర్మాత‌:  వెనిగ‌ళ్ల ఆనంద్ ప్ర‌సాద్‌

సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి

సినిమాటోగ్ర‌ఫీ: స‌న్నీ కూర‌పాటి

ఎడిటింగ్‌:  ర‌వితేజ గిరిజాల‌


మధ్య తరగతి వాడి ఆశలు.. వాటి వెంట పరుగులు తీసే వారి మనస్తత్వం వాటిని తరచి చూస్తే చాలు ఎన్నో కథలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి మధ్య తరగతి వారి మనస్తత్వాలపై ఎన్నో కథలు సినిమాలుగా రూపొంది ప్రేక్షకాదరణను పొందిన సంగతి తెలిసిందే. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే 'మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌'.  దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అయిన హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ చేసిన రెండో చిత్రమిది. తొలి చిత్రం నటుడిగా ఓకే అనిపించుకున్న ఆనంద్‌కు మరి ఈ మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ సక్సెస్‌ను అందించిందా! లేదా?  డెబ్యూ డైరెక్టర్‌ వినోద్‌ అనంతోజు హిట్‌ సాధించాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథేంటో చూడాలి.


కథ:

గుంటూరు సమీపంలోని కొలకలూరు గ్రామంలో ఉండే యువకుడు రాఘవ(ఆనంద్‌ దేవరకొండ). తండ్రి కొండలరావు(గోపరాజు రమణ), తల్లి లక్ష్మి(సురభి ప్రభావతి)తో కలిసి రాఘవ ఓ చిన్న హోటల్‌ నడుపుతుంటాడు. రాఘవకు బొంబాయి చట్నీ చేయడంలో మంచి పేరు సంపాదించుకుంటాడు. తన బొంబాయి చట్నీని గుంటూరుకి రుచి చూపించాలంటే అక్కడ ఓ హోటల్‌ పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే రాఘవ తండ్రికి మాత్రం ఆ పని ఇష్టం ఉండదు. రాఘవ తండ్రి మనసులో ఏదీ దాచుకోని రకం. మొహం మీద ఏ విషయాన్ని అయినా చెప్పేస్తాడు. కానీ రాఘవ తన ఫ్యామిలీని ఒప్పిస్తాడు. మరో వైపు గుంటూరులోని తన మరదలు సంధ్య(వర్షా బొల్లమ్మ)ను ప్రేమిస్తాడు. ఆమె తండ్రిని గుంటూరులో హోటల్‌ పెట్టడానికి సాయం అడుగుతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? రాఘవ కల నేరవేరిందా?  హోటల్‌ పెట్టి రాఘవ సక్సెస్‌ అయ్యాడా? రాఘవ, సంధ్య కలిశారా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.


సమీక్ష:

మధ్య తరగతి జీవితాల్లో నిరంతరం ఓ సంఘర్షణ ఉంటుంది. అలాంటి వాటిని అందంగా మలిచి సినిమాగా తీసి సక్సెస్‌ అయిన దర్శకులు ఎందరో ఉన్నారు. వారిని ఫాలో అవుతూనే దర్శకుడు వినోద్‌ మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ అనే కథను రాసుకున్నాడు. సినిమా టైటిల్‌కు సరిపోయేలా మధ్య తరగతి జీవితాల చుట్టూ తిరిగే కథ. రాఘవ ఒకడి జీవితమే కాదు..మనలో చాలా మంది జీవితాలు మనకు తెరపై తారసపడతాయని అనుకోవచ్చు. సినిమాలో తండ్రీ, కొడుకుల మధ్య జరిగే గొడవలు చూస్తే ప్రతి మధ్య తరగతి ఇంట్లో జరిగే వ్యవహారంలా అనిపిస్తుంది. ఇక హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ ఓకే .  ఇక ఫస్ట్‌ ఆఫ్‌లో హీరో కల అంటే గుంటూరులో హోటల్‌ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం.. ఇబ్బందులు రావడం వాటిని దాటడానికి హీరో ప్రయత్నించడం సన్నివేశాలతోనే సాగుతుంది. ఇక రెండో అర్థభాగానిది కూడా అదే హోటల్‌ సమస్యతోనే రన్‌ చేశారు. కథను నేచురల్‌గా చెప్పాలనుకోవడం తప్పులేదు కానీ.. ఎక్కువ నేచురాలిటీ కోసం ప్రయత్నిస్తే తలనొప్పి ఏంట్రా బాబూ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని వివరించాలనే తపనతో అవసరం లేని విషయాలు కూడా ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ సినిమాలో మనకు అది కనిపిస్తుంది. సినిమాను సాగే దీసే దోరణిలో చేశారా అని ఓ సందర్భంలోనూ అనిపిస్తుంది. దీని వల్ల డైరెక్టర్‌ గ్రిప్పింగ్‌గా చూపించలేకపోయాడు. ఎమోషనల్‌ కనెక్టివిటీ ఎక్కడో మిస్‌ అయిన ఫీలింగ్‌ వస్తుంది. చివరల్లో వచ్చే తరుణ్‌ భాస్కర్‌ పాత్ర వల్ల సినిమాలో ఏమైనా ఆసక్తికరంగా సన్నివేశాలుంటాయా అనుకుంటే అలాంటివేమీ కనపడవు. పాటలు, నేపథ్య సంగీతం ఓకే.. విజువల్స్‌ కూడా బావున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆనంద్‌ దేవరకొండ రెండో చిత్రానికి నటుడిగా కాస్త బెటర్‌గా అనిపించాడు. సహజంగా నటించే ప్రయత్నం చేశాడు. ఇక హీరో తండ్రి పాత్ర చేసిన గోపరాజు రమణ పాత్రలో ఒదిగిపోయారు. వర్షా బొల్లమ్మ కూడా తన పాత్ర న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా చేసిన చైతన్య కూడా చక్కగా చేశాడు. 


చివరగా.. మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌.. బొంబాయి చట్నీ అంత రుచిగా లేదు
రేటింగ్‌: 2.25/5


Advertisement
Advertisement