మిడిల్‌ ఢమాల్‌..!

ABN , First Publish Date - 2022-01-20T06:37:05+05:30 IST

టీమిండియా పరాజయ పరంపర కొనసాగుతోంది. టెస్ట్‌ సిరీస్‌లో ఓడిన భారత్‌.. వన్డేలను ఓటమితో ఆరంభించింది. భారీ లక్ష్య ఛేదనలో దిగిన రాహుల్‌ బృందం మిడిలార్డర్‌ వైఫల్యంతో

మిడిల్‌ ఢమాల్‌..!

తొలి వన్డేలో సఫారీల చేతిలో భారత్‌ ఓటమి 

ధవన్‌, కోహ్లీ, శార్దూల్‌ అర్ధ సెంచరీలు

శతక్కొట్టిన డుస్సెన్‌, బవుమా


టీమిండియా పరాజయ పరంపర కొనసాగుతోంది. టెస్ట్‌ సిరీస్‌లో ఓడిన భారత్‌.. వన్డేలను ఓటమితో ఆరంభించింది. భారీ లక్ష్య ఛేదనలో దిగిన రాహుల్‌ బృందం మిడిలార్డర్‌ వైఫల్యంతో 31 పరుగుల తేడాతో ఓడింది. ధవన్‌, విరాట్‌ అర్ధ శతకాలు చేయడం మాత్రమే ఊరటనిచ్చే అంశం. టీమిండియా బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ డుస్సెన్‌, బవుమా శతకాల మోత మోగించడంతో.. దాదాపు 300 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. బంతితోనూ టీమిండియాను కట్టడి చేసి మూడు వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ చేసింది. 


పార్ల్‌: సఫారీ గడ్డపై టీమిండియాకు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. రెండు వరుస టెస్ట్‌ల్లో చిత్తయిన భారత్‌.. బుధవారం జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డుస్సెన్‌ (96 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 129 నాటౌట్‌), బవుమా (143 బంతుల్లో 8 ఫోర్లతో 110) సెంచరీలతో అదరగొట్టారు. ఛేదనలో భారత్‌ 265/8 స్కోరు చేసి ఓడింది. శిఖర్‌ ధవన్‌ (84 బంతుల్లో 10 ఫోర్లతో 79), శార్దూల్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌), కోహ్లీ (51) అర్ధ శతకాలు వృథా అయ్యా యి. ఎన్‌గిడి, షంసీ, ఫెలుక్వాయో రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. భారత్‌ తరఫున వెంకటేష్‌ అయ్యర్‌, దక్షిణాఫ్రికా తరఫున జాన్సెన్‌ అరంగేట్రం చేశారు. 


గబ్బర్‌ గర్జించినా: సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన గబ్బర్‌.. డాషింగ్‌ బ్యాటింగ్‌తో అలరించగా.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత తొలి మ్యాచ్‌ ఆడిన కోహ్లీ అర్ధ శతకంతో గెలుపుపై ఆశలు రేపారు. కానీ, మిడిలార్డర్‌ చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు. ఓపెనర్‌ రాహుల్‌ (12)ను మార్‌క్రమ్‌ అవుట్‌ చేసినా.. ధవన్‌ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి టీమిండియా 80/1తో మెరుగ్గానే కనిపించింది. అయితే, 26వ ఓవర్‌లో శిఖర్‌ను బౌల్డ్‌ చేసిన కేశవ్‌ జట్టుకు కీలకమైన బ్రేక్‌ను అందించాడు. రెండో వికెట్‌కు ధవన్‌, కోహ్లీ 92 పరుగులు జోడించారు. తర్వాత విరాట్‌.. షంసీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరడంతో టీమిండియా 152/3తో నిలిచింది. ఆ తర్వాత 33 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకొని ఓటమిపాలైంది. శ్రేయాస్‌ (17), పంత్‌ (16) వెంటవెంటనే అవుట్‌ కావడంతో కష్టాల్లో పడింది. వెంకటేష్‌ (2), అశ్విన్‌ (7), భువీ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. అయితే, చివర్లో శార్దూల్‌, బుమ్రా (14 నాటౌట్‌).. 8వ వికెట్‌కు అజేయంగా 51 పరుగులతో పోరాడినా సాధ్యం కాలేదు. 


నిలబెట్టిన బవుమా-డుస్సెన్‌: 68/3తో ఇబ్బందుల్లోపడ్డట్టు కనిపించిన సఫారీలు.. నాలుగో వికెట్‌కు బవుమా, డుస్సెన్‌ 204 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ప్రత్యర్థికి సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. మధ్య ఓవర్లలో పసలేని టీమిండియా బౌలింగ్‌ను వీరిద్దరూ అలవోకగా ఎదుర్కొంటూ టీమ్‌ స్కోరును గాడిలో పెట్టారు. 


విదేశీగడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ.. సచిన్‌ టెండూల్కర్‌ (5065)ను అధిగమించాడు. కాగా ఓవరాల్‌గా సంగక్కర (5,518) టాప్‌లో ఉన్నాడు. 


డుస్సెన్‌-బవుమా నెలకొల్పిన 204 పరుగుల భాగస్వామ్యం.. వన్డేలో భారత్‌పై ఏ వికెట్‌కైనా రెండో అత్యధికం.


స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: డికాక్‌ (బి) అశ్విన్‌ 27, మలన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 6, బవుమా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 110, మార్‌క్రమ్‌ (రనౌట్‌/అయ్యర్‌) 4, డుస్సెన్‌ (నాటౌట్‌) 129, మిల్లర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 50 ఓవర్లలో 296/4; వికెట్ల పతనం: 1-19, 2-58, 3-68, 4-272; బౌలింగ్‌: బుమ్రా 10-0-48-2, భువనేశ్వర్‌ 10-0-64-0, శార్దూల్‌ 10-1-72-0, అశ్విన్‌ 10-0-53-1, చాహల్‌ 10-0-53-0. 

భారత్‌: రాహుల్‌ (సి) డికాక్‌ (బి) మార్‌క్రమ్‌ 12, ధవన్‌ (బి) కేశవ్‌ 79, కోహ్లీ (సి) బవుమా (బి) షంసీ 51, పంత్‌ (స్టంప్‌) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 16, శ్రేయాస్‌ (సి) డికాక్‌ (బి) ఎన్‌గిడి 17, వెంకటేష్‌ అయ్యర్‌ (సి) డుస్సెన్‌ (బి) ఎన్‌గిడి 2, అశ్విన్‌ (బి) ఫెలుక్వాయో 7, శార్దూల్‌ (నాటౌట్‌) 50, భువనేశ్వర్‌ (సి) బవుమా (బి) షంసీ 4, బుమ్రా (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 265/8; వికెట్ల పతనం: 1-46, 2-138, 3-152, 4-181, 5-182, 6-188, 7-199, 8-214; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 6-0-30-1, జెన్సెన్‌ 9-0-49-0, కేశవ్‌ 10-0-42-1, ఎన్‌గిడి 10-0-64-2, షంసీ 10-1-52-2, ఫెలుక్వాయో 5-0-26-2. 

Updated Date - 2022-01-20T06:37:05+05:30 IST