అర్ధరాత్రి అరాచకం

ABN , First Publish Date - 2021-10-25T06:34:05+05:30 IST

పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో శనివారం అర్ధరాత్రి యథేచ్ఛగా కూల్చివేతలు చేపట్టారు.

అర్ధరాత్రి అరాచకం
మార్కెట్‌లోని వ్యాపార సముదాయాలను కూల్చివేసిన దృశ్యం,

కూరగాయల మార్కెట్‌లో షెడ్ల కూల్చివేత

పోలీసు పహారాలో దౌర్జన్యకాండ

ధర్మవరం కూరగాయల మార్కెట్‌లో బీభత్సం

అడ్డుకునేందుకు యత్నించినవారి అరెస్ట్‌

అన్యాయంగా కూల్చివేశారని వ్యాపారుల ఆవేదన

ధర్మవరం, అక్టోబరు 24: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో శనివారం అర్ధరాత్రి యథేచ్ఛగా కూల్చివేతలు చేపట్టారు. యంత్రాలతో మార్కెట్‌లోకి ప్రవేశించి రేకుల షెడ్లను ధ్వంసం చేసి బీభత్సం చేశారు. అందులో కాయగూరలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా మున్సిపల్‌ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం దౌర్జన్యకాండను ప్రదర్శించారు. షెడ్లను కూల్చివేసి తమ కడుపుకొట్టవద్దని వ్యాపారులు వేడుకుంటున్నా కనికరం చూపకుండా వారిని పోలీసుల చేత పక్కకు నెట్టివేయించి షెడ్లను కూల్చివేశారు. గత మూడు రోజులుగా మార్కెట్‌లోని వ్యాపార సముదాయాల తొలగింపు కార్యక్రమానికి అధికా రులు శ్రీకారం చుట్టారు. గడువు ఇవ్వాలని వ్యాపారులు వేడుకున్నా అధికారులు వినలేదు. దీంతో వ్యాపారులు టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల నాయకులను ఆశ్ర యించారు. వారు వ్యాపారులతో కలిసి సముదాయాలను కూల్చివేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, సీపీఎం నాయకులు పోలా రామాంజనేయులు, జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ జిల్లా నాయకులు నారాయణస్వామి జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌కు మార్కెట్‌ కూల్చివేతను ఆపాలని లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇచ్చారు. హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం అర్ధరాత్రి మున్సిపల్‌ అధికారులు భారీ పోలీసు బందో బస్తు నడుమ వ్యాపార సముదాయాలను జేసీబీలతో తొలగించారు. దీంతో టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులతో పాటు వ్యాపారులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మార్కెట్‌లో ఉద్రిక్తత వాతావరణం  నెలకొంది. ఆందోళనకారులను పోలీసుల వాహనాల్లోకి విసరడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ నాయకుడు సుధాకర్‌ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆందోళనకారులను అరెస్టు చేసి బత్తలపల్లి పోలీ్‌సస్టేషనకు తరలించారు.


మార్కెట్‌ను కూల్చటం అరాచకం

-  కూల్చివేతను పరిశీలించిన బీకే, పరిటాల శ్రీరామ్‌

 పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ను దొంగల్లా అర్ధరాత్రి వచ్చి కూల్చడం అరా చకమని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు. కూరగాయల మార్కెట్‌  కూల్చివేత విషయం తెలుసుకున్న ఆయన హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారఽథి, సీపీ ఎం నాయకులు పోలా రామాంజనేయులు, జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నాయకుడు మధులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు వారికి తమ గోడు విన్నవించారు. నాయకులు మాట్లాడుతూ కూల్చివేసిన పెద్ద షాపులకు రూ.10 లక్షలు, చిన్న షాపులకు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2021-10-25T06:34:05+05:30 IST