స్వగ్రామాలకు వలస కార్మికులు

ABN , First Publish Date - 2020-03-27T11:09:23+05:30 IST

జిల్లాలో నుంచి ఉపాధి కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలస వెళ్లిన వేలాది మంది కరోనా వైరస్‌

స్వగ్రామాలకు వలస కార్మికులు

ఆందోళనలో ఆయా గ్రామస్థులు

కరోనా లక్షణాలు ఉన్నాయేమోనని భయం

చర్యలు తీసుకోవాలని విన్నపం

నిత్యం పర్యవేక్షిస్తున్నాం: తహసీల్దార్‌


ఇచ్ఛాపురం రూరల్‌, మార్చి 26 : జిల్లాలో నుంచి ఉపాధి కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలస వెళ్లిన వేలాది మంది కరోనా వైరస్‌ నేపథ్యంలో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లో కరోనా తీవ్రంగా ఉన్న విషయం  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎటు వంటి పరీక్షలు లేకుండానే స్వస్థలాలకు చేరడంతో గ్రామాల్లో యువకులు భీతిల్లుతున్నారు.  బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత్తా తదితర ప్రాంతాల్లో జిల్లాకు చెందిన సుమారు 25 వేల మందికిపైగా వలస కార్మికులు ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పలు చోట్ల పరిశ్రమలు, ఎగుమతులు నిలిచిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ పాజిటివ్‌ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాని ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు, సన్యాసిపుట్టగ, కేశుపురం, ఈదుపురం, లొద్దపుట్టి  తదితర గ్రామాలకు చెందిన వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి.రానున్న రెండు, మూడు వారాలు వైరస్‌ నియంత్రణకు ఎంతో కీలకం కానుండడంతో వలస కార్మికులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు యువకులు కోరుతున్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఇళ్లకు తిరిగి వస్తున్న వారిలో జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే  14  రోజులపాటు ఉండేలా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.వారికి కావలసిన నిత్యవసరాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నారు. 


ప్రత్యేకాధికారులను నియమించాం

వలస కార్మికులు తప్పనిసరిగా గృహ నిర్బంధంలో ఉండాలి. మండలంలోని వారి కోసం ఎనిమిది మంది ప్రత్యేకాధికారులను నియమించాం. వారు ఆశ కార్యకర్తలతో కలిసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని వసతి గృహానికి పంపిస్తున్నాం. ఇప్పటికే ఇద్దరిని అక్కడకి పంపించాం. కరోనాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.

- పి.అమల, తహసీల్దార్‌, ఇచ్ఛాపురం 


వలస కార్మికులపై దృష్టి సారించాలి 

రాష్ట్రేతర ప్రాంతాల నుంచి జిల్లాకు తిరిగి వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రతి పంచాయతీలో తిరిగి వలస కార్మికుల వివరాలు నమోదు చేయాలి. పంచాయతీ స్థాయిలో వలస కార్మికుల వివరాలు గుర్తించాలి. వారి నివాసానికి ప్రత్యేక ఏర్పాట్లుకు చర్యలు తీసుకోవాలి.

-బిమ్మో బెహరా, యువజన సంఘం  ప్రతినిధి, ఈదుపురం.

Updated Date - 2020-03-27T11:09:23+05:30 IST