కోవిడ్ సెకండ్ వేవ్.. మళ్లీ కాలు కదిపిన వలస కూలీ

ABN , First Publish Date - 2021-04-18T23:10:16+05:30 IST

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం మినహా.. మరే పరిస్థితీ మారలేదు. వలస కూలీలకు ఈ కష్టాలు మళ్లీ మొదలయ్యాయా అంటే ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి

కోవిడ్ సెకండ్ వేవ్.. మళ్లీ కాలు కదిపిన వలస కూలీ

న్యూఢిల్లీ: గతేడాది కోవిడ్ మహమ్మారి కారణంగా మొదటిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం వలస కూలీలు ఎదుర్కొన్న ఇబ్బందులు అంతా ఇంతా కావు. ఆదాయం లేక, ఆదరణ లేక పొట్ట చేత పట్టుకుని అరికాళ్లతో వందల కిలోమీటర్లపాటు వలస కూలీలు చేసిన ప్రయాణం దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా అనేక మంది సహాయ కార్యక్రమాలు చేసినప్పటికీ.. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాహన సౌకర్యం లేదు, రోడ్డుపై నుంచి వెళ్లడానికి అనుమతి లేదు, అద్దె ఇళ్లు ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి, చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇలాంటి దుస్థితిలో అర్థరాత్రుళ్లు, రైలు పట్టాల వెంట నడిచి అదే పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటే గుండె అరచేతిలోకి జారుతుంది.




లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం మినహా.. మరే పరిస్థితీ మారలేదు. వలస కూలీలకు ఈ కష్టాలు మళ్లీ మొదలయ్యాయా అంటే ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి వలస కూలీలు పెద్ద ఎత్తున సొంతింటికి ప్రయాణం అవుతున్నారు. కోవిడ్ రెండవ దశ తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనేక రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. లాక్‌డౌన్‌పై కూడా అనేక అంచనాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి వలస కూలీల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో వచ్చే రోజులను తలుచుకుని ఇప్పుడే స్వస్థలానికి ప్రయాణం అవుతున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ఆదివారం పెద్ద ఎత్తున వలస కూలీలు ఇంటికి ప్రయాణం అయ్యారు.


ఈ విషయం గురించి ఓ వలస కూలీ స్పందిస్తూ ‘‘మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ విధించాక ఎదురయ్యే పరిస్థితులు తలుచుకుంటే భయంగా ఉంది. అందుకే పరిస్థితులు బాగున్నప్పుడే సొంతిల్లు చేరాలని బయల్దేరాను. గతేడాది లాక్‌డౌన్ సమయంలో నేను ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను’’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2021-04-18T23:10:16+05:30 IST