ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయం

ABN , First Publish Date - 2021-10-20T04:37:43+05:30 IST

మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పస్బానే మిల్లత్‌ మిలాద్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేటలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్‌ వద్ద

ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయం
సిద్దిపేట జిల్లాకేంద్రంలో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింల ర్యాలీ

మిలాద్‌ ఉన్‌ నబీ శాంతి ర్యాలీలో మతపెద్దల సందేశం


సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 19 : మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పస్బానే మిల్లత్‌ మిలాద్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేటలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్‌ వద్దగల ఫిర్దౌస్‌ మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఈద్గా వరకు కొనసాగింది. అక్కడి దర్గాలో ప్రార్థనల అనంతరం మతపెద్దలు మౌలానా ఖురేషి, మొహమ్మద్‌ రఫీ, మొహమ్మద్‌ గౌస్‌, కరీం పటేల్‌ మాట్లాడుతూ మొహమ్మద్‌ ప్రవక్త మానవాళికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడిస్తే సుఖశాంతులు లభిస్తాయని పేర్కొన్నారు. మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన ఘనత మొహమ్మద్‌ ప్రవక్తదేనన్నారు. తండ్రి ఆస్తిలో సమాన భాగాన్ని ఆయన స్త్రీలకు అందజేశారని గుర్తుచేశారు. సహనం, ఓపిక, శాంతి, ధర్మంతో కూడిన నిరాడంబర జీవితం ఎవరు గడుపుతారో వారే భగవంతునికి ప్రీతిపాత్రులవుతారని స్పష్టం చేశారు. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని, తండ్రి స్వర్గం తెరిచే ద్వారమని బోధించారు. తల్లిదండ్రులకు సేవచేస్తే జీవితం సఫలమైనట్టేనని తెలియజేశారు. ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగ, జమున తహజీబ్‌తో కలిసి ఉండాలని సూచించారు. అనంతరం సిద్దిపేట అదనపు డీసీపీ రామేశ్వర్‌, ఏసీపీ దేవారెడ్డి మాట్లాడుతూ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. 


వేడుకల్లో సమాచారశాఖ కమిషనర్‌

చేర్యాల, అక్టోబరు 19: మహ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ముస్లింలు మంగళవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. చేర్యాలలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ అమీర్‌ హాజరయ్యారు. చేర్యాల తహసీల్దారు గియాసున్నిస్సాబేగం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అంతకుముందు పోలీ్‌సస్టేషన్‌ సమీపంలోని జెండాగల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు. ఆయనవెంట మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు ఉన్నారు.


తొగుట మండలంలో

తొగుట, అక్టోబరు 19: తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం మహమ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మజీద్‌లలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు జహంగీర్‌, సైఫాద్దీన్‌, ఆరీఫ్‌, ఇస్మాయిల్‌, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:37:43+05:30 IST