Advertisement
Advertisement
Abn logo
Advertisement

సైనిక విషాదం

భారతదేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక సహా పదమూడుమంది సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. మరో పదినిముషాల్లో గమ్యస్థానానికి చేరుకోబోతుండగా భారతదేశ తొలి సీడీఎస్‌ను మృత్యువు అమాంతం కబళించింది. త్రివిధదళాలను మరింత బలోపేతం చేయడంతోపాటు వాటిని మరింత ఆధునికీకరించి, వాటిమధ్య సమన్వయం సాధించే లక్ష్యంతో ఒక కొత్త వ్యవస్థ ఆయన నాయకత్వంలో రూపొందుతున్న తరుణంలో ఈ ఘోరం జరిగిపోయింది.


సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ ఉన్న వెల్లింగ్టన్ మధ్య దూరం వందకిలోమీటర్ల లోపే అయినా, దట్టమైన నీలగిరి కొండల్లో ప్రయాణించవలసివుంది. ప్రయాణం ఆరంభమైన అరగంట తరువాత ఏవో ఇబ్బందులు తలెత్తి బేస్ స్టేషన్‌తో పైలట్ సంప్రదింపులు చేశారని కూడా అంటున్నారు. సంబంధాలు పూర్తిగా తెగిన వెంటనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. జనావాస ప్రాంతంలో ప్రమాదం జరిగినందున స్థానికులు సత్వరమే పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతోపాటు, ఘోరం జరిగిన తీరు ఇదీ  అంటూ మీడియాకు కొంత తెలియచేయగలిగారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టతలేకపోయినప్పటికీ, అది పెద్దశబ్దంతో కుప్పకూలి, తగలబడిన కారణంగా ప్రయాణీకులెవ్వరూ బతికిబట్టకట్టగలిగే అవకాశం లేకపోయింది. ప్రతికూల వాతావరణంలో ప్రయాణం సాగుతున్నప్పుడు చిన్న సాంకేతిక సమస్య కూడా ఘోరానికి దారితీస్తుంది.

మానవతప్పిదాలకూ వీలుకలుగుతుంది. నిజానికి, ఈ రష్యా తయారీ ఆర్మీ హెలికాప్టర్‌కు అత్యంత శక్తిమంతమైనదీ, సమర్థవంతమైనదని పేరు. దాని అత్యాధునిక సాంకేతికత, నలభైమందిని కూడా మోయగలిగే శక్తి, దట్టమైన మంచులోనూ, ఎడారి వేడిలోనూ, కఠినమైన ప్రతికూలవాతావరణంలోనూ ప్రయాణించగలిగే సమర్థత, ఆరువేలమీటర్ల ఎత్తులోనూ ఐదువందల కిలోమీటర్ల వరకూ నిర్విరామంగా ఎగరగలిగే సమర్థత దానిని వీవీఐపీలకోసం ప్రత్యేకంగా వినియోగించేందుకు వీలుకల్పించింది. రెండు ఇంజన్ల హెలికాప్టర్ సైతం ఇలా విఫలం కావడం వెనుక కారణాలేమిటో లోతైన దర్యాప్తు మాత్రమే వెలికితీయగలదు.

భారత రక్షణరంగంలో అతిపెద్ద సంస్కరణలకు సీడీఎస్‌గా రావత్‌ మార్గదర్శి. త్రివిధ బలగాల మధ్య సయోధ్యను సాధించడం, వాటిని ఆధునికీకరించడమనే గురుతరబాధ్యతను భుజానకెత్తుకున్నారు. దేశవ్యాప్తంగా త్రివిధ దళాలకు ఉన్న పదిహేడు కమాండ్లను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా గుదిగుచ్చే పనిలో ఉన్నారాయన. ఇప్పటివరకూ మూడు బలగాలూ దేనికదే అధికారాలనూ హోదానూ అనుభవిస్తుండగా, ఆయా ప్రాంతాల్లో కీలకభూమిక నిర్వహించే ఒక బలగం కమాండ్‌లో మిగతావి ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. దళాల ఆధునికీకరణ, హేతుబద్ధీకరణతో పాటు వనరులనూ, ఆయుధ సంపత్తినీ గరిష్ఠ వినియోగానికి అనుకూలంగా మలచే బాధ్యత ఆయనది. థియేటర్ కమాండ్స్ విషయంలో త్రివిధ దళాల్లోనూ ముఖ్యంగా వైమానికదళంలో తీవ్ర అయిష్టత నెలకొన్నదని అంటారు. అయినప్పటికీ, ఇది మోదీ అప్పగించిన బాధ్యత, మీ అభ్యంతరాలు 2022 జూన్ లోగా తెలియచేయండి అంటూ తన ముసాయిదా నివేదికను త్రివిధబలాధిపతులకూ ఇచ్చారట. వచ్చే ఏడాది ఆగస్టునాటికల్లా దీనిని ఓ కొలిక్కితేవాలన్న సంకల్పం నెరవేరకముందే రావత్ కన్నుమూశారు. నెహ్రూ కాలంనుంచే సీడీఎస్ ఆలోచన ఉన్నప్పటికీ, త్రివిధదళాల మధ్య విభేదాలకు కారణమవుతున్నదన్న భయంతో దానిని గత ప్రభుత్వాలు ఆచరణలో పెట్టలేదు. మోదీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం వెనుక రావత్ పట్ల ఉన్న నమ్మకం కూడా ఓ కారణం. మనసులో మాట కఠినంగా చెప్పడం ద్వారా రావత్ పలుమార్లు విమర్శలకు గురైనమాట వాస్తవం. ఆర్మీచీఫ్‌గా ఉన్నప్పుడే ఆయన పాలకపక్షం మనసెరిగి మాట్లాడుతున్నారన్న విమర్శలకు గురైనారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలను తప్పుబట్టారు. ఆ తరువాత కశ్మీర్‌లో రాళ్ళురువ్వే పిల్లలపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైనాయి. వాటన్నింటినీ అటుంచితే, సైనికుడినుంచి మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారివరకూ అందరితోనూ సఖ్యతగా ఉంటూ వారిని ఉత్సాహపరచే బిపన్ రావత్ మరణం తీరని లోటు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...