ఏ పాలు మంచివి?

ABN , First Publish Date - 2020-10-25T22:21:09+05:30 IST

పిల్లల ఎదుగుదల సవ్యంగా ఉండాలంటే సవ్యమైన పోషకాహారం అత్యవసరం. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు...

ఏ పాలు మంచివి?

మా పాప వయసు పదకొండేళ్ళు. చలాకీగా ఉంటుంది కానీ బరువు బాగా తక్కువ. బరువు పెరిగేందుకు ఏవైనా సలహాలివ్వగలరు. 

- నరసింహాచారి, హైదరాబాద్‌ 


పిల్లల ఎదుగుదల సవ్యంగా ఉండాలంటే సవ్యమైన పోషకాహారం అత్యవసరం. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు, వాటిని పొడి చేసి పిండిలో కలిపి చపాతీ, పరాఠాల లాంటివి చేసి ఇవ్వవచ్చు. పాలల్లో శక్తినిచ్చే పొడులు కలపవచ్చు. ఎటువంటివి కలపాలి అన్న దాని గురించి వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు పెట్టండి. ఆకలి సరిగా లేకపోవడం వల్ల తినడం లేదనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు పెట్టకూడదు. ఇంట్లో తయారు చేసిన నువ్వులు బెల్లం ఉండలు, మినప సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వండి. ఖర్జ్జూరాలు, ఎండు ద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌లా ఇస్తే బరువు పెరిగేందుకు అవసరమైన కెలోరీలను అందించవచ్చు. ఆ వయసు పిల్లల బరువు నియంత్రణలో ఉండాలంటే ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర చాలా అవసరం. కనీసం ఎని మిది నుండి తొమ్మిది గంటలు నిద్ర పోయేలా చూడాలి. 


ప్యాకెట్‌ పాలు మంచివా లేక విడిగా దొరికే పాలు మంచివా?

- నాసీర్‌, వరంగల్‌ 


పాలు, పాల ఉత్పత్తులను ఎన్నుకునేటప్పుడు, పాశ్చరైజ్డ్‌, పాశ్చరైజ్‌ చేయని పాల మధ్య తేడాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్యాకెట్‌ లో లభించే పాలు పాశ్చరైజ్డ్‌ చేయబడి ఉంటాయి. పాశ్చరైజేషన్‌ ప్రక్రియలో పాలను వేడి చేసి చల్లార్చి ఆ తరువాత ప్యాకెట్లలో నింపుతారు. ఈ ప్రక్రియ ద్వారా పాలలోని వ్యాధికారక సూక్ష్మ జీవులు నశిస్తాయి. ప్యాకెట్‌లలో దొరికే పాలు వివిధ పాళ్ళలో వెన్నను కలిగి ఉంటాయి. అందువల్ల ప్యాకెట్‌ పాలు కొనేప్పుడు మనకు కావలసిన వెన్న శాతం ఉన్న పాలను ఎంచుకొనే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద కంపెనీ బ్రాండ్ల నుండి పాకెట్లో దొరికే పాలు కల్తీ అయ్యే అవకాశం చాలా తక్కువ. విడిగా దొరికే పాలలో నీళ్లు కలపడం, మరో విధంగా అయినా కల్తీ చేసే అవకాశం ఎక్కువ. విడిగా పాలు కొనేప్పుడు అవి పితికిన సమయం నుండి గంట లోపు మీకు అందే విధంగా ఉంటే మంచిది. విడిగా పాలను కొన్నప్పుడు తప్పనిసరిగా ఓసారైనా కాచిన తరువాత మాత్రమే వాడాలి. పాలు పాకెట్లో కొన్నా, విడిగా కొన్నా వాటి పోషక విలువలలో మాత్రం పెద్దగా తేడాలుండవు. 




నా  వయసు పద్దెనిమిదేళ్లు. జుట్టు రాలుతోంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 

- భగత్‌, తిరుపతి

వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, నిద్రలేమి, హార్మోన్‌ల అసమతుల్యత, ఒత్తిడి... ఇలా పలు కారణాల వల్ల యుక్తవయసులో కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. స్పెషలిస్టును కలిసి కారణం తెలుసుకోండి. దాంతో పాటు మీ సమస్యను తగ్గించడానికి ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు, పన్నీర్‌, సొయా గింజలు, అన్ని రకాల పప్పు ధాన్యాలు తప్పకుండా తీసుకోండి. వీటితో  పాటు పాలు, పెరుగు, ముడి ధాన్యాలు, ఆకుకూరలు ఎంతో అవసరం. వీటిలోని ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఉండడానికి,  ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు మొదలైన వాటిల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కూడా ఉపయోగపడతాయి. ఆహార జాగ్రత్తలతో పాటు, జీవన విధానంలో స్ట్రెస్‌ లేదా ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది.





డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్

‌nutrifulyou.com

Updated Date - 2020-10-25T22:21:09+05:30 IST