మళ్లీ విషమించిన మిల్కాసింగ్ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-18T21:52:25+05:30 IST

కరోనా బారినపడి కోలుకుంటున్న దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్యం శుక్రవారం మళ్లీ క్షీణించింది.

మళ్లీ విషమించిన మిల్కాసింగ్ ఆరోగ్యం

చండీగఢ్: కరోనా బారినపడి కోలుకుంటున్న దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్యం శుక్రవారం మళ్లీ క్షీణించింది. చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్) లో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్‌ను రెండు రోజుల క్రితమే కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి షిఫ్ట్ చేశారు. అంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయనలో ఆక్సిజన్ స్థాయులు పడిపోయాయని, జ్వరం కూడా రావడంతో ఆరోగ్యం మరింత దిగజారిందని వైద్యులు తెలిపారు. 


కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న మిల్కాసింగ్‌ను బుధవారం నాన్ కొవిడ్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. మిల్కాసింగ్ ఆరోగ్యంపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. మిల్కా సింగ్ మే 19న కరోనా బారినపడ్డారు. ఈ నెల 13న మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ (85) మొహాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో కన్నుమూశారు. మిల్కాసింగ్‌లో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో ఈ నెల 3న పీజీఐఎంఈఆర్‌లో చేర్చారు. 

Updated Date - 2021-06-18T21:52:25+05:30 IST