కేసీఆర్‌ ఇలాకాలో మినీ ఐవోసీలు

ABN , First Publish Date - 2022-01-29T07:59:47+05:30 IST

సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో మరో పైలెట్‌ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది.

కేసీఆర్‌ ఇలాకాలో మినీ ఐవోసీలు

  • ‘గజ్వేల్‌’లోని అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు
  • కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత భవనాలు
  • ఇటీవల సమీక్షలో అధికారులకు సూచించిన సీఎం
  • రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా గజ్వేల్‌లో నిర్మాణాలు


గజ్వేల్‌, జనవరి 28: సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో మరో పైలెట్‌ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమీకృత కలెక్టరేట్‌ భవనాలను నిర్మిస్తున్నది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా ఈ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ (ఐవోసీ)ల నిర్మాణానికి సీఎం పూనుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటగా సిద్దిపేట జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించిన ముఖ్యమంత్రి.. అంతకంటే ముందే తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంతో పాటుగా డివిజనల్‌ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఐవోసీలను నిర్మించి ప్రారంభించారు. ఈ ఐవోసీల ద్వారా ప్రజలకు విశేష సేవలందుతున్నందున మండలస్థాయిలోనూ ఇదేవిధంగా మినీ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాన్ని చేపట్టాలని   నిశ్చయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌.. ఇటీవలే మర్కుక్‌ మండలం ఎర్రవల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సమీక్షలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అనువైన స్థలాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


 నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్‌, ములుగు, మర్కుక్‌, వర్గల్‌, నియోజకవర్గ పరిధిలోని మెదక్‌ జిల్లాలో ఉన్న తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండల కేంద్రాల్లో ఈ మినీ ఐవోసీల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అందుకు అవసరమైన అంచనాలు, ప్రణాళికలను రూపొందించాలని ఇప్పటికే సీఎం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో పలు మండలాల్లో ప్రజలకు అందుటులో ఉండేలా అనువైన స్థలాలను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మినీ ఐవోసీల నిర్మాణానికి కావాల్సిన నిధుల అంచనాలను పంచయతీరాజ్‌ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శరత్‌ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి నెలాఖరులోగా స్థలాలను గుర్తించి, నిర్మాణాలకు కావాల్సిన అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మినీ ఐవోసీలు పూర్తయితే మండల పరిధిలో తలా ఓ చోట ఉన్న మండల స్థాయి కార్యాలయాలన్నీ ఒకే భవన సముదాయంలోకి వస్తాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందనున్నాయి.   

Updated Date - 2022-01-29T07:59:47+05:30 IST