మైనింగ్‌ వాటా మళ్లింపు

ABN , First Publish Date - 2020-08-04T10:35:30+05:30 IST

నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపరిషత్‌లకు రాయల్టీలను రద్దు చేసింది. ఫలితంగా నిధుల లేక ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి

మైనింగ్‌ వాటా మళ్లింపు

జడ్పీలను కాదని డీఎంఎ్‌ఫటీలకు కేటాయింపు

ఏటా జిల్లా పరిషత్‌ల ఆదాయానికి గండి 

ప్రభావిత గ్రామాల్లో ఆగిపోతున్న అభివృద్ధి 

పాతపద్ధతినే అమలు చేయాలని డిమాండ్‌


హన్మకొండ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపరిషత్‌లకు రాయల్టీలను రద్దు చేసింది. ఫలితంగా నిధుల లేక ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. వాస్తవానికి ఇదివరకు వివిధ ఖనిజాల తవ్వకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 30 శాతం వాటాను జిల్లా పరిషత్‌లకు కేటాయించేవారు. కానీ 2016 నుంచి ఈ విధానం మారింది. కొత్తగా జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (డీఎంఎ్‌ఫటీ)లను ఏర్పాటు చేసి వాటికి మళ్లిస్తున్నారు. దీంతో ఆ నిధులు జడ్పీల ద్వారా పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతరత్రావాటికి వినియోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 


డీఎంఎ్‌ఫటీల్లో మూలుగుతున్న నిధులు..

ఖనిజాల తవ్వకం ద్వారా రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయంలో ఖనిజ రకాల ఆధారంగా 10 నుంచి 30 శాతం వరకు జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (డీఎంఎ్‌ఫటీ)జమ చేస్తున్నారు. ఈ నిధులను ఖనిజ ఉత్పత్తి జరిగిన గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కోసం ట్రస్ట్‌ నిర్వహణ కమిటీ కేటాయించాలి. కానీ ఆలా జరగటం లేదు. ఫలితంగా ఆయా గ్రామ పంచాయతీలకు ట్రస్ట్‌ ద్వారా లక్షల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయి. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గనుల చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం ఖనిజాల తవ్వకాల మూలంగా ప్రభావితమయ్యే ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయడానికి జిల్లాల వారీగా జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌లను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌కు కలెక్టర్‌ చైర్మెన్‌ కాగా సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు.


వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ల్లో కోట్లాది రూపాయల నిధులు మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పంచాయతీల్లో క్వారీల ద్వారా వచ్చే  ఆదాయాన్ని తమ ప్రాంతానికే ఖర్చు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లభిస్తున్న ఇసుక, క్రషర్‌, మొరం, మట్టి, బ్లాక్‌ గ్రానైట్‌, కలర్‌ గ్రానైట్‌, పలుగురాళ్ళు ఇలా వివిధ రకాల ఖనిజ తవ్వకాల ద్వారా ఏటా 108.2. కోట్లలో ఆదాయం వస్తోంది.  అంటే ఏటా సుమారు రూ. 30 కోట్ల మేర జిల్లా పరిషత్‌లు నష్టపోతున్నాయి.


రూ. కోట్లలో ఆదాయం..

2019  ఏప్రిల్‌  నుంచి 2020 జూన్‌ వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ. 108.2 కోట్లకుపైగా దాయం సమకూరింది. ఇందులో జిల్లా పరిషత్‌లకు వాటాను విడుదల చేస్తే అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైనింగ్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం సంబంధిత గ్రామ పంచాయతీకి,  50 శాతం సంబంధిత మండల పరిషత్‌కు కేటాయించగా, మిగిలిన 25 శాతం నిధులను జిల్లా పరిషత్‌ అభివృద్ధికి ఖర్చు చేసుకోవాలన్న నిబంధనలు గతంలో ఉండేవి. ఇందులో ఇసుక తవ్వకాలపై వచ్చిన ఆదాయం నేరుగా జిల్లా పరిషత్‌కు జమవుతుంది. ఇతర మైనింగ్‌ తవ్వకాల ద్వారా వచ్చే రాబడి మాత్రం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ఇందులో  30 శాతం వాటా ట్రస్ట్‌లకు వెళుతోంది. దీంతో నిధులు లేక జిల్లా పరిషత్తు పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యాక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయా జిల్లాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పెరిగిన జడ్పీలు.. తగ్గిన ఆదాయం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటికి 2019 జూలైలో జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేశారు. వీటితో జడ్పీల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆయా జిల్లాల్లో మైనింగ్‌ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. కాని, జడ్పీలకు రాయల్టీల రూపంలో రావాల్సిన  ఆదాయం మాత్రం గణనీయంగా తగ్గింది. మైనింగ్‌ తవ్వకాల్లో ప్రస్తుతానికి ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిధులే వస్తున్నాయని, మిగత ఖనిజాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడంలేదని జిల్లా పరిషత్‌ సీఈవోలు చెబుతున్నారు. 


ఉమ్మడి జిల్లాలో భారీ ఖనిజ సంపద..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఖనిజ సంపదకు పెట్టింది పేరు. విలువైన ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలు ఇక్కడ లభిస్తాయి. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బొగ్గుతో పాటు ఐరన్‌ ఓర్‌, లాటరైట్‌ పెద్ద తరహా ఖనిజాలు, బ్లాక్‌గ్రానైట్‌, కలర్‌ గ్రానైట్‌,  డోలమైట్‌, క్వార్జ్‌ వంటి చిన్న తరహా ఖనిజ నిల్వలు  విస్తారంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 603 క్వారీలు నడుస్తున్నాయి. వీటిలో భూగర్భ గనుల శాఖ బ్లాక్‌గ్రానైట్‌ 256, కలర్‌ గ్రానైట్‌ 43, స్టోన్‌ మెటల్‌ 158, లాటరైట్‌ 43, డోలమైట్‌ 3, క్వార్జ్‌ 2, వీటితో పాటుఉ కొన్ని చిన్నచిన్నవి కలుపుకొని మొత్తం 603 క్వారీలకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఖనిజాలపై రాయల్టీ, సీవరేజ్‌ చార్జీల ద్వారా ఉమ్మడి జిల్లాకు ఏటా సుమారు రూ. 108.21 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఆపరాధ రుసుము ద్వారా మరో రూ. 1.50 కోట్ల మేర అభిస్తోంది. ఇసుకపై సీనరేజ్‌ కింద ఏటా మరో రూ.7 కోట్ల ఆదాయం వస్తోంది. 

Updated Date - 2020-08-04T10:35:30+05:30 IST