మైనింగ్ జోన్ కదిపారు

ABN , First Publish Date - 2020-09-18T17:28:03+05:30 IST

గెలాక్సీ గ్రానైట్‌పై కన్నేసిన పాలక పెద్దలు భారీగా లబ్ధి పొందేందుకు పెద్ద పథకాన్నే..

మైనింగ్ జోన్ కదిపారు

శరవేగంగా ముందుకు వెళ్తున్న వైసీపీ ప్రభుత్వం

4 కిలోమీటర్లు.. రూ.4వేల కోట్ల సంపద అంచనా

కర్నూల్‌రోడ్‌ మూసివేతకు ప్రతిపాదన

డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ ప్రత్యక్ష పరిశీలన

ప్రత్యామ్నాయంగా 14 కి.మీ లాంగ్‌ బైపాస్‌కు రూట్‌మ్యాప్‌

టోపోగ్రఫీ సర్వేకు టెండర్లు పిలుపు

2015లో ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత

శాసనసభా కమిటీ, గిరిజా కుమార్‌ కమిటీలకు సెగ

దక్షిణకాశి రామతీర్థం ప్రాభవానికి ముప్పు అని ఆందోళన

వెనక్కి తగ్గిన అప్పటి ప్రభుత్వం


చీమకుర్తి(ప్రకాశం): గెలాక్సీ గ్రానైట్‌పై కన్నేసిన పాలక పెద్దలు భారీగా లబ్ధి పొందేందుకు పెద్ద పథకాన్నే రచించారు. కోట్లు లబ్ధికి బాటలు తవ్వడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని గత  ప్రభుత్వం విరమించుకున్న మైనింగ్‌జోన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నూల్‌రోడ్‌ కింద ఉందని భావిస్తున్న గ్రానైట్‌ వెలికితీత, మైనింగ్‌జోన్‌ ప్రతిపాదనలను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించే పనిలో పడింది. రూ.4వేల కోట్ల సంపదే లక్ష్యంగా అప్పటి ప్రతిపాదనలను తిరిగి రంగంలోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చటానికి అధికారులు శరవేగంగా అడుగులు వేస్తున్నారు.


గత వారంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ వెంకటరెడ్డి సైతం అధికారులతో కలిసి రామతీర్థం సమీపాన నిక్షేపాలు దాగి ఉన్నాయని భావిస్తున్న కర్నూల్‌ రోడ్‌, బఫర్‌జోన్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతకు ముందు రెవెన్యూ, మైన్స్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి నివేదికను అందించారు. అపార నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్న కర్నూల్‌ రోడ్‌ని మూసివేస్తే ప్రత్యామ్నాయంగా చీమకుర్తి నుంచి మర్రిచెట్లపాలెం వరకు దాదాపు 14కి.మీ మేర లాంగ్‌ బైపాస్‌ నిర్మాణానికి అనుగుణంగా టోపోగ్రఫీ సర్వే నిర్వహణకు ఈనెల 23వ తేదీ చివరి గడువుగా టెండర్లను సైతం పిలవటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం తవ్వాలని సిద్ధమవుతున్న మైనింగ్‌జోన్‌పై ప్రత్యేక కథనం.


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వ ఖజానాకి ఆదాయ వనరులను పెంచుకోవటానికి మహదావకాశంగా గ్రానైట్‌ నిక్షేపాలను మలుచుకొనే పనిలో ఇప్పటికే నిమగ్నమైంది. అందులోభాగంగా మరింత లబ్ధి పొందేందుకు మైనింగ్‌జోన్‌ను వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ ప్రకాశానికి ముఖద్వారం అయిన చీమకుర్తి నుంచి వెళ్తున్న ఒంగోలు-కర్నూలు రాష్ట్ర రహదారి 24వ మైలురాయి నుంచి 33వ మైలురాయి వరకు రహదారికి ఇరువైపులా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్‌ క్వారీలు, అనుబంధ పరిశ్రమలు విస్తరించాయి. రోడ్డుకు దక్షిణం వైపున ఉన్న క్వారీల్లో నాణ్యమైన, ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఖరీదైన గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ, పన్నుల రూపంలో ఏటా రూ.250 కోట్ల  వరకు ఆదాయం చే కూరుతుంది. ఈ రో డ్డుకు ఇరువైపులా బఫర్‌జోన్‌ కింద విడిచిపెట్టిన స్థలంతో కలి పి రోడ్‌ వెడల్పు 107 మీటర్లు ఉంటుంది. 



2015లో వెలుగులోకి..

కర్నూల్‌ రోడ్‌ 24వ మైలురాయి నుంచి 28వ మైలురాయి ఆవలి వరకు 4.4 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారి కింద నాణ్యమైన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని 2015లో జియాలజిస్టులు తేల్చారు. నాలుగున్నర కి.మీ పొడవు, 107 మీటర్ల వెడల్పున సుమారు 43 హెక్టార్ల పరిధిలో 1.7 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ నిక్షేపాలున్నట్లు ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో సర్వే చేసిన ఏపీఎండీసీ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రికవరీ శాతాన్ని బట్టి అప్పటి విలువ ప్రకారం కనీసం రూ.3,424 కోట్ల విలువచేసే సంపద  ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న రహదారి పక్కనే ఉన్న క్వారీ యజమానులు ఎవరికివారు తమ పక్కన ఉన్న రోడ్డుకు లీజుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా ఎందుకు అనుకున్న అప్పటి ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా క్వారీయింగ్‌ నిర్వహిస్తే ఖజానాకు పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుందని భావించి మైనింగ్‌జోన్‌ ప్రతిపాదనను తీసుకొచ్చింది. క్వారీయింగ్‌ కార్యకలాపాలు అనుబంధ పరిశ్రమలు విస్తరించిన ప్రాంతం మొత్తాన్ని కలిపి మైనింగ్‌ జోన్‌గా చేయాలని నిర్ణయించారు.


దీంతో మైనింగ్‌కు సంబంధించని వారు, ఇతర వాహనాలు కానీ ఈ జోన్‌లోకి ప్రవేశించటానికి వీలులేదు. మైనింగ్‌ జోన్‌తో దుమ్ము,ఽ దూళీ, కాలుష్య సమస్యలు కూడా తీరిపోతుందని భావించారు. ఈ చర్యలతో మూతపడే కర్నూలు రోడ్డుకు ప్రత్యామ్నాయంగా చీమలమర్రి నుంచి మర్రిచెట్లపాలెం వరకు లాంగ్‌ బైపా్‌సను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికనుగుణంగా సర్వే నిర్వహించి నిర్మాణం, భూసేకరణ తదితరాలకు దాదాపు రూ.58కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.


ప్రజలు, అన్నిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత

మైనింగ్‌ జోన్‌తో కర్నూలు రోడ్డును మూసివేయటం పట్ల స్థానికులు, ఆయా గ్రామాల వారు, అన్నిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రోడ్డు మూసివేయటంతో దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న రామతీర్థం, గంగమ్మ తల్లి దేవాలయాలకు వెళ్లే దారి మూతపడుతుందని, చీమకుర్తి తన ప్రాభవాన్ని కోల్పోతుందని ప్రజలు ఆందోళనలు జరిపారు. మైనింగ్‌జోన్‌ అమలుపై నియమించిన గిరిజాశంకర్‌ కమిటీ, యథార్థస్థితిని పరిశీలించటానికి నియమించిన శాసనసభా కమిటీ చైర్మన్‌ కాగితం వెంకట్రావు, సభ్యులు 2015 ఏప్రిల్‌, మే నెలలో చీమకుర్తికి వచ్చారు. వారి ముందు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, వైసీపీ నాయకులతోపాటు టీడీపీ వారు సైతం మైనింగ్‌జోన్‌పై వ్యతిరేకతను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారు. రోడ్డు కింద వేల కోట్ల  సంపద ఉందనే అంశంపై కూడా అన్నిపక్షాలు ముక్తకంఠంతో విభేదించాయి. రోడ్‌ పక్కనే ఖాళీగా వందల ఎకరాలు ఉన్నాయని, ఆ భూముల్లో నాణ్యమైన గ్రానైట్‌ లభించదనే ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని వాదననూ కమిటీల ముందుకు తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తలనొప్పి ఎందుకులే అనుకొని మైనింగ్‌జోన్‌ ప్రతిపాదనను విరమించుకున్న అప్పటి ప్రభుత్వం నాలుగు కి.మీ మేర పట్టణ శివారు వరకే బైపా్‌సను నిర్మించింది.


కానీ ఇపుడు మాత్రం తాజా వైసీపీ ప్రభుత్వం మైనింగ్‌జోన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రామతీర్థం గుడికి ప్రత్యామ్నాయ రహదారిని ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌పై నుంచి నిర్మించి, 14కి.మీ మేర లాంగ్‌ బైపాస్‌ను ఆర్‌ఎల్‌పురం, మైలవరం గ్రామాల వెలుపల నుంచి మర్రిచెట్లపాలెం వరకు నిర్మించటానికి టోపోగ్రఫీ సర్వే జరపనున్నారు. తదుపరి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ముందుకు వెళ్లే అవకాశం కనపడుతుంది.


ప్రభుత్వం అనుమతి మేరకు చర్యలు

టోపోగ్రఫీ సర్వే తదుపరి బైపాస్‌ నిర్మాణానికి తాజా అంచనాలు తెలుస్తాయి. అన్ని విషయాలు నివేదించి ప్రభుత్వ నిర్ణయం మేరకు మైనింగ్‌ జోన్‌పై ముందుకు వెళ్తాం.

-నరసింహారెడ్డి, డీడీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ


టోపోగ్రఫీ సర్వేకు టెండర్లు

చీమలమర్రి నుంచి చీమకుర్తి వరకు 14కి.మీ మేర బైపాస్‌ నిర్మాణం కోసం ఖర్చు అంచనాకు టోపోగ్రఫి సర్వే నిర్వహించటానికి టెండర్లు పిలిచాం. ఈ నెల 23వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు.

-సురేష్‌, జేఈ, ఆర్‌అండ్‌బీ

Updated Date - 2020-09-18T17:28:03+05:30 IST