సీఎంకు సెల్యూట్‌.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

ABN , First Publish Date - 2021-05-14T06:05:07+05:30 IST

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. అన్న స్థాయి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కోసం ఎదురుచూసే స్థాయికి ప్రభుత్వ వైద్యసేవల స్థాయి పెరిగింది. ఇందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు సెల్యూట్‌’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

సీఎంకు సెల్యూట్‌..  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌
ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ విష్ణు యస్‌ వారియర్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు

 ఆయన కృషితోనే కొవిడ్‌ వైద్యసేవలు బలోపేతం

 ఉమ్మడి జిల్లాకు 10వేల డోసుల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 

 ప్రాంతాల వారీగా ప్రభుత్వ వైద్యసేవల పెంపు

 ఖమ్మం ఆసుపత్రిలో ‘ఐటీసీ’ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ప్రారంభం

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 13 : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. అన్న స్థాయి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కోసం ఎదురుచూసే స్థాయికి ప్రభుత్వ వైద్యసేవల స్థాయి పెరిగింది. ఇందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు సెల్యూట్‌’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి భద్రాచలంలోని ఐటీసీ సంస్థ అందించిన ఐదు మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వాహనాన్ని ఆయన ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గురువారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పెనుబల్లిలో ప్రభుత్వ కొవిడ్‌ వైద్యసేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, కొవిడ్‌ మందుల కోసం ఉమ్మడి జిల్లాలో విడి విడిగా హైపవర్‌కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 10వేల డోసుల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందిస్తున్నామన్నారు. కొవిడ్‌ రోగులు ఎట్టి పరిస్థితిలో భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉందన్నారు. అలాగే రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ కొవిడ్‌ వైద్యసేవలు రాష్ట్ర స్థాయిలోనే ఖమ్మం జిల్లా ఆదర్శంగా ఉందన్నారు. 320 పడకలతో రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉందని ప్రాణాపాయస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వారు కోలుకుని ఇంటికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూక్య రమేశ్‌ అనే కరోనా బాధితుడు మంత్రి వద్దకు వచ్చి తనకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలని కోరడంతో స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్‌ కర్ణన్‌కు లేఖ పంపారు.

నయా నైటింగేల్స్‌కు ఘన సన్మానం

గాలివాన కారణంగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కరోనా వార్డులో మంగళవారం రాత్రి విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన సందర్భంలో సమయస్ఫూర్తితో వైద్యసేవలు అందించిన నర్సింగ్‌ ఉద్యోగులను  ఘనంగా సత్కరించారు. నర్సింగ్‌ ఉద్యోగులు వెంకట నర్సమ్మ, ప్రసన్న, రాధ, చంద్రిక, ఉమా, ప్రవీణ్‌కుమార్‌, రాజీవ్‌, సంతోషి, రజినీతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ దేవకీదేవిలకు మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ విష్ణు యస్‌ వారియర్‌ పూలమొక్కలు అందించి ఘనంగా సన్మానించారు.  నర్సింగ్‌ ఉద్యోగుల కృషితోనే జిల్లా ఆసుపత్రి రెండు సార్లు కాయకల్ప ఆవార్డులను దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, ఏవో డాక్టర్‌ రాజశేఖర్‌గౌడ్‌, డాక్టర్‌ సురేశ్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సుగుణ, డైటీషీయన్‌ సూర్యపోగు మేరీ, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

 


Updated Date - 2021-05-14T06:05:07+05:30 IST