మరణాలకు వైద్యులదే బాధ్యత

ABN , First Publish Date - 2020-07-14T11:35:15+05:30 IST

వైద్యాధికారులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

మరణాలకు వైద్యులదే బాధ్యత

విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 


బుట్టాయగూడెం, జూలై 13: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు డుమ్మా  కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆ కారణంగా మరణాలు సంభవిస్తే వైద్యులే బాధ్యత వహించాలన్నారు. సోమవారం ఏజెన్సీలో ఆయన పర్యటించారు. బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంద ర్శించి అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రుల్లో  వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజును ఆదేశించారు. ఏజెన్సీలో మలేరియా జ్వరాల కేసులు ఈ ఏడాది 78 నమోదైనట్లు మలేరియా అధికారి ప్రసాద్‌ తెలిపారు. బుట్టాయ గూడెంలో ల్యాబ్‌ సామర్థ్యాన్ని పెంచాలని, ఎక్స్‌రే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలరాజు కోరగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వెంటనే మొబైల్‌ ఎక్స్‌రే యూనిట్‌ను బుట్టాయగూడేనికి పంపాలని డీసీహెచ్‌ఎస్‌ శంకర రావును ఆదేశించారు. అనంతరం అల్లి కాలువ సమీపంలో 12 ఎకరాల స్థలంలో రూ.75 కోట్లతో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించారు.


ఎమ్మెల్యే ఎలీజా, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ రామకృష్ణ, ఐటీడీఏ పీవో సూర్యనారాయణ, ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ, డీఎస్పీ వెంకటేశ్వరావు, డీఎంహెచ్‌వో డాక్టరు సునంద తదితరులు ఉన్నారు. బుట్టాయిగూడెం పర్యటనకు వచ్చిన మంత్రికి వేలేరుపాడు నుంచి అఖిలపక్ష కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. 2007లో సేకరించిన భూములకు అదనంగా ఎకరానికి రూ.5 లక్షలు ఇస్తామని, ఆర్‌అండ్‌ఆర్‌ వ్యక్తిగత ప్యాకేజీ రూ.10 లక్షలకు పెంచు తామని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒకరికీ ప్యాకేజీ ఇస్తామని సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికలముందు హామీ ఇచ్చారని మంత్రికి వివరించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని  మంత్రి వారికి చెప్పారు. 

Updated Date - 2020-07-14T11:35:15+05:30 IST