మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-09T07:24:06+05:30 IST

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా శనివారం ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన సతీమణికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు...

మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

  • మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలకు.. 
  • రాష్ట్రంలో మరో 2,256 కొత్త కేసులు
  • ఒకరోజులో ఇదే అత్యధికం
  • కొవిడ్‌తో 14 మంది మృతి
  • 77,513కు చేరిన కేసుల సంఖ్య


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా శనివారం ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన సతీమణికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసొలేషన్‌లో ఉండగా, ఆయన సతీమణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి సైతం కరోనా సోకింది. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వారు నానక్‌రాంగూడలోని తమ నివాసంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి పాజిటివ్‌గా తేలింది. ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,256 పాజిటివ్‌లు వచ్చాయి. ఇంత భారీగా కేసులు బయటపడటం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 77,513కు చేరింది. గత నాలుగు రోజుల వ్యవధిలోఏకంగా 8,567 మంది వైరస్‌ బారినపడ్డారు. టెస్టుల సంఖ్య పెరిగే కొద్దీ పాజిటివ్‌లూ అంతే స్థాయిలో వస్తున్నాయి. అలాగే శుక్రవారం ఏకంగా 14 మంది వైరస్‌ వల్ల చనిపోయారు.


ఒకేరోజు ఇంతమంది చనిపోవడం ఇది మూడోసారి. జూన్‌ 7న, జూలై 31న ఒకరోజే 14 మంది చొప్పున కన్నుమూయగా తాజాగా అదే స్థాయిలో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య  615కు చేరుకుంది. గత 24 గంటల్లో  కరోనా నుంచి కోలుకొని మరో 1,091 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 22,568 యాక్టివ్‌ కేసులుండగా, హోమ్‌ ఐసొలేషన్‌లో 15,830 మంది ఉన్నట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం 23,322 టెస్టులు చేయగా, అందులో 1,596 నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో  కొత్తగా 464 కేసులు రాగా, కరీంనగర్‌లో 101, మేడ్చల్‌లో 138, రంగారెడ్డిలో 181, వరంగల్‌ అర్బన్‌లో 187, సంగారెడ్డిలో 92, పెద్దపల్లిలో 84, సిరిసిల్లలో 78, సిద్దిపేటలో 63, నల్లగొండలో 61, గద్వాలలో 95, భద్రాద్రి కొత్తగూడెంలో 79, ఖమ్మంలో 69 మందికి పాజిటివ్‌ వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తన కుమారుడికి కరోనా సోకిందన్న మనస్తాపంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. యాదా ద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఏపీలో ఒక్కరోజే 97 మరణాలు 

ఏపీలో తాజాగా మరో 10,080మంది కొవిడ్‌ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 2,17,040కు చేరాయి. 13 జిల్లాల్లో ఏకంగా 97మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ 1,939 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా మరో 9,151మంది కరోనా నుంచి కోలుకున్నారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో 39మంది సిబ్బందికి  పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. 


Updated Date - 2020-08-09T07:24:06+05:30 IST