కరోనా వేళ మంత్రి చిల్లర రాజకీయాలు

ABN , First Publish Date - 2021-05-12T05:27:25+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

కరోనా వేళ మంత్రి చిల్లర రాజకీయాలు
మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

టీడీపీ నేత కోటంరెడ్డి ఆగ్రహం

నెల్లూరు(వ్యవసాయం), మే 11 : జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరులోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత పడవల కృష్ణమూర్తి చావుబతుకుల్లో ఉండి బెడ్‌ దొరకని పరిస్థితుల్లో తాను స్వయంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అతన్ని చేర్పించానన్నారు. దీనిని కూడా మంత్రి అనిల్‌ రాజకీయ కోణంలో చూసి దిగజారుడు రాజకీయాలకు దిగారని విమర్శించారు. మంత్రి ముందుగానే మీడియాకి సమాచారం ఇచ్చి సమీక్షల కోసం వెళ్లి కరోనా తెచ్చుకున్నాడని ప్రకటనలు చేయించుకున్నారని ఆరోపించారు. మంత్రి అనిల్‌ లాంటి నటుడు మరొకరుండరని హేళన చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌ కావాలంటే దాదాపు రూ.30వేలు, రెమ్‌డెసివిర్‌  ఇంజక్షన్‌ కావాలంటే 4 లక్షల నుంచి 5లక్షలు, చివరకు  శ్మశానంలో శవాన్ని దహనం చేయాలంటే రూ.15వేల నుంచి రూ.20వేలు తీసుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే జిల్లా మంత్రులు ఏమయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించేందుకు మాత్రం  ఇద్దరు మంత్రులు పోటీపడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవాబుపేట సీఐ వేమారెడ్డి అధికారపార్టీ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. కరోనా నివారణ చర్యల్లో విఫలమైన ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-12T05:27:25+05:30 IST