థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2021-06-15T07:34:45+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న నేపఽథ్యంలో దీన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టండి
మాట్లాడుతున్న మంత్రి అనిల్‌

టాస్క్‌ఫోర్స్‌ సమీక్షలో మంతి అనిల్‌ 


నెల్లూరు(వైద్యం), జూన్‌ 14 : కరోనా థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న నేపఽథ్యంలో దీన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, థర్డ్‌వేవ్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. సెకండ్‌వేవ్‌ను సమర్ధంగా ఎదుర్కొనడంలో అధికారులు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో తగినన్ని వైద్య పరకరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది నియామకాలు, అవగాహన కార్యక్రమాలపై నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని చెప్పారు.  జిల్లాలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు 64 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో కరోనా పాజిటివ్‌ రికవరీ రేటు 94.1 శాతం ఉందన్నారు. ఈ అంశంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో, దేశంలో ఐదవ స్థానంలో ఉందని చెప్పారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు నివేదికలు తయారు చేశామన్నారు. ముందస్తు ఏర్పాట్లను జూలై 15వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు. అంతకుముందు జేసీ గణేష్‌కుమార్‌ కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఆసుపత్రులలో పడకలు, కంటైన్మెంట్‌ మేనేజ్‌మెంట్‌, 104 కాల్‌సెంటర్‌, మందులు, థర్డ్‌వేవ్‌ సన్నద్ధతపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జేసీ బాపిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్‌, డీఆర్వో చిన ఓబులేసు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీపీవో ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T07:34:45+05:30 IST