ఐఏబీ.. అత్యవసరం

ABN , First Publish Date - 2020-04-04T10:25:44+05:30 IST

రెండో పంటకు అందించాల్సిన నీటి కేటాయింపు విషయంపై అత్వసరంగా ఐఏబీ సమావేశం నిర్వహించాలని జిల్లా రైతు సంఘం నాయకులు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను కోరారు.

ఐఏబీ.. అత్యవసరం

 నిబంధనల ప్రకారం నీరు కేటాయించాలి

మంత్రికి రైతు సంఘం నేతల వినతి 

నిబంధనల మేరకు నీరిస్తామన్నా మంత్రి 


నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్‌ 3 : రెండో పంటకు అందించాల్సిన నీటి కేటాయింపు విషయంపై అత్వసరంగా ఐఏబీ సమావేశం నిర్వహించాలని జిల్లా రైతు సంఘం నాయకులు మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను కోరారు. నెల్లూరులోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం ఆ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని రెండో పంటకు నీటి విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఐఏబీ సమావేశంపై కలెక్టరుకుకూడా వినతి పత్రం ఇచ్చామని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా, రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, నేతల ఒత్తిడితో వీలుకాని విధివిధానాలతో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. పెన్నార్‌ డెల్టా రైతుల హక్కులకు భంగం కలిగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చట్టపరంగా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


గత ప్రభుత్వ హాయాంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపై చేసిన పోరాటాలను వారు వివరించారు. డెల్టా ఆయకట్టుకు నిబంధనల ప్రకారం నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామి ఇచ్చారు. ఎస్‌ఈలతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఐఏబీలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దీంతో సంఘం నాయకులు డెల్టా రైతులు రెండో పంటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజవాడ గోవిందురెడ్డి, ఎన్‌.నిరంజన్‌రెడ్డి, పి.పురంధర్‌రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, ఎం.మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:25:44+05:30 IST