పద్ధతిగా నడుచుకోండి.. నేనెక్కడైనా అలా చేశానా?

ABN , First Publish Date - 2021-05-18T17:42:57+05:30 IST

తప్పుచేస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప..

పద్ధతిగా నడుచుకోండి.. నేనెక్కడైనా అలా చేశానా?

రామనాథంబాబుకు మంత్రి బాలినేని హెచ్చరిక

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే పార్టీకి నష్టం


(ఒంగోలు, ఆంధ్రజ్యోతి): తప్పుచేస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప నలుగురిలో దూషణ సరికాదని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు (రాంబాబు)ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మందలించారు. సోమవారం ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నేతలతో రామనాథంబాబు బాలినేనిని కలిశారు. ఇంకొల్లు సీఐ, పర్చూరు ఎస్సైలను రామనాథంబాబు దుర్భాషలాడటం, ఆ విషయంపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం, ఎస్పీ ఈ విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ సంఘటనపై రాంబాబు సోమవారం మంత్రిని కలవగానే, మంత్రి సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది.


ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ వ్యవహారశైలే సరికాదని, ఆయనపై పలు ఫిర్యాదులను మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేశారు. వెంటనే మంత్రి.. ‘ముందు మనం పద్ధతిగా ఉండాలి.. నేను మంత్రిని ఎక్కడైనా అధికారులను దుర్భాషలాడటం విన్నావా.. ఎందుకంత ఆవేశం, నీ చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా’ అంటూ మందలించారు. మరోవైపు ఇటీవల సీడీపీవో పట్ల కూడా ఆవేశంగా మాట్లాడినట్లు తెలిసింది ఇది మంచి పద్ధతి కాదన్నారు. అయితే రాంబాబు, ఆయనతో వచ్చిన నేతలు సీఐపై పదేపదే ఫిర్యాదులు చేసే ప్రయత్నం చేయగా.. ‘అలాంటి వ్యవహారంపై ఉన్నతాధికారులకు చెబితే వారు చూసుకుంటారు.. అంతేగానీ పదిమందిలో మనం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదు’అంటూ మంత్రి వేరే కార్యక్రమానికి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-05-18T17:42:57+05:30 IST