తెర వెనుక మంత్రి గూడుపుఠాణీ!

ABN , First Publish Date - 2021-02-28T06:11:28+05:30 IST

అంతా అనుకున్నట్టే జరుగుతోంది..

తెర వెనుక మంత్రి గూడుపుఠాణీ!

అంతా గప్‌చుప్‌!

దుర్గగుడి ఈవో బదిలీపై మీనమేషాలా?

కోట్లు చేతులు మారాయా?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతా అనుకున్నట్టే జరుగుతోంది.. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక సాగిస్తున్న మంత్రాంగం పని చేస్తున్నట్టు ఉంది. శనివారం ఉదయమే రాష్ట్రవాప్తంగా 21 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, నియామకాలను చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాల ఈవోలను కూడా బదిలీ చేసి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కానీ ఆ రెండు దేవాలయాల కంటే పెద్దదైన దుర్గగుడిలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. ఇక్కడి ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


దుర్గగుడిలో ఏసీబీ బృందాలు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలను గుర్తించి, ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించినా, ఈ అవినీతి మొత్తం ఈవో సురేశ్‌బాబు కనుసన్నల్లోనే జరిగిందని గుర్తించినా, ఆయనపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగి అడ్డుచక్రం వేసినందునే సురేశ్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. 


మంత్రి గూడుపుఠాణీ!

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్ల వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే దుర్గగుడిలో ఏసీబీ దాడులు చేయడం... భారీస్థాయిలో అవినీతి, అక్రమాలను వెలికితీయడం, 15 మందిని సస్పెండ్‌ చేయడం.. వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఈ అక్రమాల్లో కీలక పాత్రధారి అయిన ఈవో సురేశ్‌బాబుపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతానికి సూత్రధారి మంత్రి వెలంపల్లేనంటూ ప్రతిపక్షాల నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. అవినీతి ఆరోపణలతో వ్యక్తిగతంగానే కాకుండా, కార్పొరేషన్‌ ఎన్నికల్లో రాజకీయంగానూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన మంత్రి ముందుగా నష్టనివారణ చర్యలకు దిగారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని దుర్గగుడి ఈవోగా తీసుకుతెచ్చుకున్న సురేశ్‌బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు బలం చేకూరుతుందనే ఉద్దేశంతో ఈవోపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపేందుకు తనకున్న రాజకీయ పలుకుబడితోపాటు అర్థబలాన్ని కూడా ఉపయోగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


తెరవెనుక బేరసారాలు?

ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకుడి ద్వారా మంత్రి వెలంపల్లి తెరవెనుక మంత్రాంగం నడిపి, ప్రస్తుతానికి దుర్గగుడి ఈవోపై చర్యలు తీసుకోకుండా నిలిపివేయించగలిగారని ఇంద్రకీలాద్రిపై చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవడం తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, అలాగే తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఈవో సురేశ్‌బాబు కుటుంబంలో త్వరలోనే శుభకార్యం ఉందని, ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకుంటే ఇద్దరికీ తీరని నష్టం జరుగుతుందంటూ ఆ కీలక నేతకు వివరించి ఒప్పించగలిగారని సమాచారం. ఈ క్రమంలో తెరవెనుక పెద్దఎత్తున బేరసారాలు కూడా జరిగాయని, రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దుర్గగుడి ఈవోపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు గప్‌చుప్‌గా ఉన్నాయని భావిస్తున్నారు. 

Updated Date - 2021-02-28T06:11:28+05:30 IST