వ్యర్థాల సమర్థ నిర్వహణతోనే క్లీన్‌ ఏపీ

ABN , First Publish Date - 2021-06-18T05:50:24+05:30 IST

వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా జరిగినప్పుడే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

వ్యర్థాల సమర్థ నిర్వహణతోనే క్లీన్‌ ఏపీ
ప్లాంట్‌ను పరిశీలిస్తున్న మంత్రి బొత్స, మేయర్‌ మనోహర్‌నాయుడు, కమిషనర్‌ అనురాధ

జిందాల్‌ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి బొత్స

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 17: వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా జరిగినప్పుడే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఓబులునాయుడుపాలెంలోని జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి గురువారం పరిశీలించారు. ప్రాజెక్ట్‌ ప్రసిడెంట్‌ ఎంఎం చారి ప్రాజెక్టు వివరాలను మంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్లాంట్‌ నిర్మాణం, మిషనరీ ఏర్పాటు పనులు నూరు శాతం పూర్తయ్యాయని, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు అనుసంధానం, నీటి సౌకర్యం పనులు కల్పిస్తే 20 రోజుల్లో ప్లాంటు వినియోగంలోకి వస్తుందని చారి తెలిపారు. పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి  అఽధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 10 శాతం పనులే జరిగాయని తెలిపారు. వచ్చే నెలలో ప్లాంట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు. తాడేపల్లి మున్సిపాలిటీల నుంచి సేకరించిన వ్యర్థాలతో ప్లాంట్‌లో గంటకు 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ విద్యుత్‌ను ప్రభుత్వం రూ.6.12 పైసలకు కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం జగన్‌ స్వయంగా లేదా వర్చువల్‌ విధానంలో ప్లాంట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లాంట్‌ వలన పర్యావరణానికి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వ్యర్థాల సేకరణకు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ద్వారా 720 వాహనాలు అందించామన్నారు. వెంగళాయపాలెంలోని వాటర్‌ ప్లాంట్‌ నుంచి  ప్లాంట్‌కు నీటి సరఫరా చేస్తామన్నారు. అనంతరం ప్లాంట్‌ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగమనోహర్‌ నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, అంబటి రాంబాబు, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ చంద్రయ్య, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు రామచంద్రారెడ్డి, శ్రీనివాసరావు, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఎస్‌ఈ దాసరి శ్రీనివాసరావు, ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దారు మోహనరావు, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్లాంట్‌ ఏజీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:50:24+05:30 IST