Abn logo
Oct 23 2021 @ 07:52AM

న్యాయపరంగానే ఆ భూముల స్వాధీనం: Minister

అడయార్‌(Chennai): నగర శివారుప్రాంతమైన పూందమల్లిలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్‌ పార్కు క్వీన్స్‌ల్యాండ్‌ ఆధీనంలో వున్న ఆలయ భూములను చట్టప్రకారంగా స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌బాబు వెల్లడించారు. ఆయన శుక్రవారం తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో క్వీన్స్‌ల్యాండ్‌ స్వాధీనం చేసుకున్న భూములను పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, పూందమల్లి సమీపంలోని పళంజూరు, పాప్పాన్‌ఛత్రంలో ఉన్న కాశీ విశ్వనాథ, వేణుగోపాల్‌ ఆలయానికి చెందిన 117 ఎకరాల భూములను క్వీన్స్‌ల్యాండ్‌ ఆక్రమించుకున్నట్టు గతంలోనే ఫిర్యాదులందాయన్నారు. దీంతో  2013 లో క్వీన్స్‌ల్యాండ్‌ తరపున మద్రాస్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ వేయగా, అందులో కేవలం 21 ఎకరాల ఆలయ భూములను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొందని మంత్రి గుర్తుచేశారు. ఈ కేసుపై ఇటీవల న్యాయమూర్తి ఎం. సుందర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపగా, ప్రభుత్వం తరపున దాఖలైన అఫిడవిట్‌లో ఈ భూములను క్వీన్స్‌ల్యాండ్‌ ఆక్రమించుకున్నట్టు పేర్కొనడం జరిగిందన్నారు. పైగా ఈ భూముల లీజు  1998లోనే ముగిసినప్పటికీ క్వీన్స్‌ల్యాండ్‌ చట్ట వ్యతిరేకంగా ఈ భూములను తన ఆధీనంలో ఉంచుకుందన్నారు. అందువల్ల ఈ భూములను చట్టపరం గానే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని మంత్రి శేఖర్‌ బాబు వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption