Abn logo
Sep 7 2021 @ 23:03PM

ఎవరైనా ఆయన లైన్‌లోనే నడవాలి.. ఆయన చెప్పినట్టే చేయాలి.. లేదంటే ఇబ్బందులు తప్పవు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

అభివృద్ధే ధ్యేయంగా అడుగులు

ఉమ్మడి జిల్లాలో నేను చేసిన అభివృద్ధేంటో ప్రజలకు తెలుసు

దళితబంధును పకడ్బందీగా అమలు చేస్తాం

వచ్చే జూన్‌ నాటికి ‘సీతారామ’ పనులు పూర్తి

2023లో ‘పది’లో గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతం 

టీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ పెట్టిన పార్టీ.. 

అందరూ ఆయన లైన్‌లోనే నడవాలి

రవాణాశాఖలో ఎన్నో మార్పులు తెచ్చాం

ఆన్‌లైన్‌లోనే 17రకాల సేవలందిస్తున్నాం

‘ఆంధ్రజ్యోతి’తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

మంత్రిగా పువ్వాడ అజయ్‌ బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు


ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఈ రెండేళ్లలో నేను సంతృప్తికరంగా పనిచేశా. రాబోయే రోజుల్లో నా శాఖా పరంగా మరిన్ని సంస్కరణలు తేవడంతో పాటు.. మంత్రిగా ఉమ్మడి జిల్లా అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నా. అలాగే ఈ రెండేళ్లలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో పార్టీకి విజయాలను అందించా. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది నియో జకవర్గాల్లోనూ పార్టీని విజయపథంలో నడిపిస్తా’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’తో పలు అంశాలను పంచుకున్నారు. 


ఆంధ్రజ్యోతి: ఈ రెండేళ్లలో మీ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి?

పువ్వాడ: నేను చేసిన అభివృద్ధి గురించి నేను చెప్పడం కాదు. ఖమ్మం నియోజకవర్గం, ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుసు. కొవిడ్‌ విపత్కర సమయంలో కూడా ఒక్క నా నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. ఖమ్మంలో ఐటీహబ్‌, నగర సుందరీకరణ, రహదారుల అభివృద్ధి, ఇలా ప్రజలు అడిగిన అన్నిపనులు చేసి చూపించా. ఇకపై కూడా ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా. ఏజెన్సీ, మైదాన ప్రాంత సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. కొత్తగూడెంలో మంజూరైన మెడికల్‌ కాలేజీని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కొత్త కలెక్ట రేట్లకు ఎదరైన నిధులు సమస్య పరిష్కరించి త్వరలోనే ప్రారం భానికి సిద్ధం చేస్తాం.


ఆంధ్రజ్యోతి: సీతారామ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోంది. దానిపై మీరేమంటారు? 

పువ్వాడ: కొవిడ్‌ కారణంగా పనులకు కొంత అవాంతరాలు ఏర్పడ్డాయి. వచ్చే జూన్‌ నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తిచేయించి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయి. పాలేరు లింక్‌కెనాల్‌కు సంబంధించి మూడు ప్యాకేజీల టెండర్లు పూర్తయ్యాయి. కొంత భూసేకరణసమస్య ఉంది. దసరా నాటికి ప్రారంభిస్తాం. ఈపనులు కూడా వచ్చే ఏడాదికే పూర్తి చేస్తాం. దాంతో కాళేశ్వరం తరహాలో సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుంది.


ఆంధ్రజ్యోతి: జిల్లాలో పార్టీ బలోపే తానికి తీసుకుంటున్న చర్యలు?

పువ్వాడ: ప్రస్తుతం సంస్థాగత కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల నాయకత్వంలో చురుగ్గా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించడమే లక్ష్యంగా అంతా పనిచేస్తాం. ఇందుకు మంత్రిగా నా వంతు బాధ్యత నిర్వహిస్తా. రెండేళ్లకాలంలో స్థానిక సంస్థలకు చెందిన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, సహకార, మునిసిపల్‌, లోక్‌సభ ఎన్నికలు అలాగే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికల వరకు జిల్లాలో పార్టీకి విజయాలు అందించా. ఇదే లక్ష్యంతో పదిసీట్లు గెలిపించి తీరుతామన్న నమ్మకం నాకుంది. 


ఆంధ్రజ్యోతి: పార్టీలో అంతర్గత విబేధాలతో ఇబ్బందుల్లేవా?

పువ్వాడ: ఇది కేసీఆర్‌ పెట్టిన పార్టీ. ఎవరైనా కేసీఆర్‌ లైన్‌లో నడిచి..ఆయన చెప్పినట్టే చేయాలి. కేసీఆర్‌ నిర్ణయాన్ని ధిక్కరిస్తే రాజకీయంగా పార్టీపరంగా వారికి ఇబ్బందులు తప్పవు. 


ఆంధ్రజ్యోతి: ‘దళితబంధు’పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ పథకం అమలు సాధ్యమేనా?

పువ్వాడ: తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు దళితబంధు అమలుచేయడం పెద్దకష్టంకాదు. రైతుబంధు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్‌, బీజేపీ ఇలాగే విమర్శించాయి. కేసీఆర్‌ పెట్టిన పథకాలు విజయవంతమై.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు దళితబంధు కూడా ఆదర్శం కాబోతోంది. ఖమ్మంజిల్లాలో కూడా చింతకాని మండలాన్ని మొడల్‌గా ఎంచుకున్నాం. జిల్లా అంతటా దశలవారీగా ప్రతి కుటుంబానికి సహాయం అందించి తీరుతాం. 


ఆంధ్రజ్యోతి: మీ రెండేళ్లపాలనలో రవాణాశాఖ మంత్రిగా ఆ శాఖలో తెచ్చిన మార్పులు?

పువ్వాడ: రవాణాశాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ సమ్మె, కొవిడ్‌ లాక్‌డౌన్‌లు చూశాం. తొలుత రవాణాశాఖ పరంగా చూస్తే గతంలో పేరుకే ఆన్‌లైన్‌ సేవలుగా ఉన్నదానిని 17రకాల సేవలను ఆర్టీఏ ఎం వ్యాలెట్‌ ద్వారా అందిస్తున్నాం. లైసెన్సు నుంచి ఫ్యాన్సీ నెంబరు వరకు సేవలందుతున్నాయి. గతంలో ప్రతీ పనికి ఏజెంట్లను సంప్రదించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం యాప్‌లతోనే సౌకర్యాలు పొందుతున్నారు. రవాణాశాఖలో ఇష్టానుసారంగా తనిఖీలు లేకుండా చెక్‌పోస్టులవద్ద తనిఖీలుపెట్టి అవినీతిని తగ్గించి.. పారదర్శకతను పెంచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ర్టానిక్‌వాహనాలకు ఉచిత రిజిస్ర్టేషన్‌ ప్రవేశపెట్టి.. వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.

 

ఆంధ్రజ్యోతి: ఇంకా చాలాచోట్ల మధ్యవర్తుల హవా నడుస్తోందన్న విమర్శలపై మీ స్పందన? 

పువ్వాడ: కొందరు అవగాహన లోపంతో మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి లైసెన్సు ఇచ్చేటప్పుడు, వాహన రిజిస్ర్టేషన్‌ సమయంలో, వాహనం చూపించేటప్పుడు రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని పనులు యాప్‌లో చేసుకునేలా సౌకర్యాలు కలిపించాం.  


ఆంధ్రజ్యోతి: ఆర్టీసీ పరంగా తెచ్చిన మార్పులు?

పువ్వాడ: ఆర్టీసీ చరిత్రలో తీవ్ర నష్టాలు, కష్టాలు ఈ రెండేళ్లలో చూశాం. ఓ వైపు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె.. మరోవైపు కొవిడ్‌ లాక్‌డౌన్‌, కేంద్రం డీజిల్‌ ధరలను తీవ్రంగా పెండంతో సంస్థ నష్టపోతోంది. రూ.2వేలకోట్లు రావాల్సిన ఆదాయం రూ.వెయ్యికోట్లకు పరిమితమైంది. అందుకే పూర్తిస్థాయి ఎలక్ర్టికల్‌ వాహనాల ఏర్పాటుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికితోడు ఖర్చులు తగ్గించి ప్రత్యామ్నాయ ఆదాయాలను పెంచుతున్నాం. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఏర్పాటుచేసిన కార్గోసేవలు విశేషంగా మన్ననలు పొందుతుంది. ఈ కొరియర్‌ సర్వీసులతో ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు వెళ్లే తెలంగాణ బస్సులున్నచోట కూడా కార్గోసేవలు ఏర్పటుచేస్తున్నాం. మొత్తంమీద కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని మూసివేయాలని చెబుతున్నా రాష్ట్ర ప్రజల రవాణా సౌలభ్యం కోసం నష్టాలను కూడా భరించి ఆర్టీసీని నడిపిస్తున్నాం. దశలవారీగా నష్టాలను అధిగమించి లాభాల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సజ్జనార్‌ను ఎండీగా నియమించాం.