బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-06-15T05:45:48+05:30 IST

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
కౌన్సిలర్‌ నట్వర్‌ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మంత్రి దయాకర్‌ రావు

కార్యకర్తలను  కంటికి రెప్పలా కాపాడుకుంటాం

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తొర్రూరు, జూన్‌ 14: కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పట్టణ కేంద్రంలోని 7వ వార్డు కౌన్సిలర్‌ నట్వర్‌ కుటుంబాన్ని, 10వ వార్డు కౌన్సిలర్‌ దొంగరి రేవతి శంకర్‌ బావ దొంగరి శ్రీనివాస్‌ కుటుంబాన్ని, 16వ వార్డు కౌన్సిలర్‌ బిజ్జాల మాధవి అనిల్‌ మామ బిజ్జాల వెంకటేశ్వర్లు కుటుంబాలను పరామర్శించి వారితో మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుం టానని తెలిపారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, సీఎం కేసీఆర్‌ కరోనా బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందిస్తారని తెలిపారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సీతారాములు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.యాకూబ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు  తదితరులు ఉన్నారు. 

 కరోనా కట్టడికి టీకా తీసుకోవాలి

పెద్దవంగర: ఆపత్కాలంలో ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు అండగా నిలుద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా విజృం భిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని కోరారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా పని చేసి కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. కరోనా వైరస్‌పై గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి టీకా వేసుకునేలా చూడాలని కోరారు. ఐసోలేషన్‌ కేంద్రంలో కరోనా బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు.  నాయకులు, ప్రజాప్రతినిధులు నిరుపేదలకు అండగా నిలిచి చేయూతనిచ్చి ప్రజల హృదయాల్లో నిలిచి పోయేలా కృషి చేయాలన్నారు. పేదలకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. రూ. 10కోట్లతో పెద్దవంగర మండలం నుండి ఉప్పరగూడెం వరుకు డబుల్‌ రోడ్డుతోపాటు సెంట్రల్‌లైటింగ్‌ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.  

 

Updated Date - 2021-06-15T05:45:48+05:30 IST