వరంగల్: ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లనే ఇప్పుడు దేశ, మన రాష్ట్ర ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కోసం 9 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ముందుగానే మన దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం, అవి అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. వరంగల్‌లోని ఎంజిఎం హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను మంత్రి దయాకర్‌రావు ప్రారంభించారు. నిర్ణీత వైద్యులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మొదటి విడతగా డాక్టర్ల చేత మంత్రి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 21 కేంద్రాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్ పంపిణ జరుగుతోందన్నారు. ఉమ్మడి వరంగల్‌లో 46,579 మంది కరోనా బారిన పడగా, వారిలో 45, 768 మంది కోలుకున్నారని తెలిపారు. కరోనాతో చనిపోయిన వారిని ఎవరూ పట్టించుకోని సమయాల్లో ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ , గ్రామ పంచాయితీలు, ఇతర సిబ్బంది పట్టించుకుని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పాలకుర్తి నియోజక వర్గంలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో, జనగామజిల్లా పాలకుర్తిలోనూ మంత్రి ఎర్రబెల్లి వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అఽధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.