అభివృద్ధి పై రాజీ లేదు-త్వరలో57 ఏళ్ళు నిండిన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు

ABN , First Publish Date - 2021-01-17T22:02:29+05:30 IST

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాండించిన క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ, ఆర్థిక ప‌రిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కెసిఆర్,

అభివృద్ధి పై రాజీ లేదు-త్వరలో57 ఏళ్ళు నిండిన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు

పాల‌కుర్తి: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాండించిన క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ, ఆర్థిక ప‌రిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్, సంక్షేమ‌-అభివృద్ధి ప‌థ‌కాల‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొన‌సాగిస్తున్నార‌ని, అభివృద్ధిలో రాజీ ప‌డేది లేద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు అన్నారు. జ‌న‌గామ జిల్లా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం పాల‌కుర్తిలో నియోజ‌క‌వ‌ర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్ లు త‌దిత‌ర‌ స్థానిక ప్రజాప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఈ స్థాయిలో ప‌నులు జ‌రుగుతున్న రాష్ట్రం తెలంగాణ త‌ప్ప మ‌రోటి లేద‌న్నారు. కొన్ని కొత్త‌ పెన్ష్ల‌ను ఆగిపోయాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే, 57 ఏళ్ళు నిండిన అర్హులైన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు ఇచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. అలాగే  ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల‌ను ఆర్థికంగా అభివృద్ధి ప‌రిచేందుకు వీలుగా రుణాలు, ఉపాధి అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.


ఇక పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో స్త్రీ నిధి ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీకే రుణాల అందచేసి వారి అభివృద్ధికి పాటు ప‌డ‌తామ‌ని మంత్రి తెలిపారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో కొంత ఆర్థిక ఇబ్బందులున్న కార‌ణంగా దాదాపు గ‌త‌ ఏడాది కాలంగా అనుకున్న విధంగా అన్నిప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌లేక‌పోయామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు.




క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, దేశీయ‌ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌చ్చింద‌ని, వ్యాక్సిన్ విజ‌య‌వంతంగా వినియోగం జ‌రుగున్నందున ఇక ప్ర‌జాభివృద్ధి, సంక్షేమాల‌పై ప్ర‌భుత్వం, సీఎం కెసిఆర్ దృష్టి సారించ‌నున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. కావాల్సింద‌ల్లా ప్ర‌జాప్ర‌తినిధులంతా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని, వారిని ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల్లో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు.

Updated Date - 2021-01-17T22:02:29+05:30 IST