రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-10-31T00:16:30+05:30 IST

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు

జనగామ: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం స్థానిక వైష్ణవి గార్డెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు,  కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం కరోనా కష్ట కాలంలో ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన తెలిపారు. వ్యవసాయ అధికారులు యాసంగిలో ఏ పంట వేస్తే, ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది, ఎక్కువ లాభం వుంటుందో సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్య పరుస్తారని  ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు రైతులకు ఈ దిశగా అవగాహన కల్పించాలన్నారు. 


ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించి కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణ చేయాలన్నారు. నవంబర్ 6 నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన కోరారు. వడ్లు దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో లక్షా ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 93 ఐకెపి, 65 పిఏసిఎస్, ఒకటి ఇతర, మొత్తం 159 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసామన్నారు.కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు త్రాగునీరు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు సాగునీరు నిండుగా ఉందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలన్నారు. 

   

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, రైతును రాజుగా చేయడానికి, రైతు కష్టాలు తీర్చడానికి, రైతు ఆత్మహత్యల నివారణకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంట పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందించడంలో పాటు, రైతుల మౌళిక అవసరాలన్ని తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఈ సమావేశంలో డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణా రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బి. విజయ, జనగామ ఆర్డీవో మధు మోహన్, డిసిఓ కిరణ్ కుమార్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట నారాయణ గౌడ్, జిల్లా అధికారులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, కేంద్రాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T00:16:30+05:30 IST