దేశంలో రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది మీరే: మంత్రి ఈటెల

ABN , First Publish Date - 2021-03-02T17:45:53+05:30 IST

కొవిడ్ సమయంలో డాక్టర్లు జీతాల కోసం పని చేయలేదని.. ఒక సేవా దృక్పథంతో పని చేశారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

దేశంలో రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది మీరే: మంత్రి ఈటెల

హైదరాబాద్: కొవిడ్ సమయంలో డాక్టర్లు జీతాల కోసం పని చేయలేదని.. ఒక సేవా దృక్పథంతో పని చేశారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దేశంలో రాష్ట్ర గౌరవాన్ని చిత్రపటంలో నిలబెట్టింది తమరే అని కొనియాడారు. డాక్టర్ల కష్టాలను, బాధలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి చేసుకుందని...ఈ 365 రోజుల కాలంలో కదిలిస్తే కన్నీళ్లే వచ్చే విధంగా సిబ్బంది సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ కేసు వచ్చే ముందు ఇతర దేశాల్లో ఎంతో సివియర్‌గా ఉందని చెప్పారు. ఆ సమయంలో కోవిడ్ ఇండియాకి వస్తే శవాల గుట్టలే ఉంటాయని అనుకున్నారు... కానీ ఇక్కడి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో త్వరగా కట్టడి చేశామని అన్నారు. కరోనాతో ఎంతో సైన్స్ ఉన్నప్పటికీ వేదన అనుభవించామని మంత్రి గుర్తుచేశారు. డాక్టర్లను ప్రజలు గుర్తించి గుండెల్లో పెట్టుకునే రోజులు వచ్చాయన్నారు. ప్రైవేటు హాస్పిటల్‌లు మూతపడినా ప్రజలకు సేవ చేసేవి ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే అని గుర్తించారని తెలిపారు.


ప్రభుత్వ హాస్పిటల్‌ల పైన ఉన్న ఒక భావన పోయి ప్రజల్లో తమ డాక్టర్లు అనే భావన వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు మరింత పేరు ఉండాలని ఆకాంక్షించారు.  ఆరోగ్యానికి కేంద్రంగా గాంధీ మారబోతోందని తెలిపారు. గాంధీ హాస్పిటల్‌లో కొత్తగా రూ.35 కోట్లతో అధునాతన సౌకర్యాలు రూపొందిస్తున్నామని చెప్పారు. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో డాక్టర్లు లేని పరిస్థితి ఉందన్నారు. డెడ్‌బాడీ తీసుకుపోవడానికి రాకపోతే తామే ఖననం చేశామన్నారు. సైన్స్, విజ్ఞానం ఉన్నప్పటికీ అనుభవం పాఠాలు నేర్పుతుందని అన్నారు. కరోనా అందరికీ అలా ఎన్నో అనుభవాలు నేర్పించిందని....రేపటి భవిష్యత్‌కి ఈ అనుభవాలు ఒక పునాది అని మంత్రి ఈటెల పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-02T17:45:53+05:30 IST