ఎకరంపైగా స్థలం : Permission కోసం పట్టు.. రంగంలోకి మంత్రి కుటుంబీకులు!

ABN , First Publish Date - 2021-12-17T16:26:17+05:30 IST

అది ఉప్పల్‌ రింగ్‌రోడ్డు. నాగోల్‌వైపు మార్గం. మెట్రోరైల్‌ స్టేషన్‌ ఎదురుగా ఎకరంపైగా స్థలం...

ఎకరంపైగా స్థలం : Permission కోసం పట్టు.. రంగంలోకి మంత్రి కుటుంబీకులు!

  • అనుమతులు లేకుండానే భారీ నిర్మాణ పనులు
  • ట్రాఫిక్‌ ఎన్‌ఓసీ లేదు.. యూఎల్‌సీపైనా స్పష్టత కరువు
  • ఫిర్యాదులతో నిలిచిన పనులు
  • అనుమతుల కోసం అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిడి

అది ఉప్పల్‌ రింగ్‌రోడ్డు. నాగోల్‌వైపు మార్గం. మెట్రోరైల్‌ స్టేషన్‌ ఎదురుగా ఎకరంపైగా స్థలం. అక్కడ వాణిజ్య అవసరాలు, రెండు స్ర్కీన్‌లతో కూడిన మల్టీప్లెక్స్‌ కోసం మూడు సెల్లార్లు, గ్రౌండ్‌ ప్లస్‌ ఏడంతస్తులతో ఓ భారీ భవన నిర్మాణాన్ని తలపెట్టారు. అనుమతుల కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేశారు. ఫైల్‌ పరిశీలనలో ఉండగానే పనులు మొదలుపెట్టారు. ఇందులో ఓ మంత్రి కుటుంబసభ్యులకు భాగస్వామ్యం ఉందని, అందుకే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే అభిప్రాయాలున్నాయి. అనుమతులకోసం ‘సదరు మంత్రి’ కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అనుమతి త్వరగా వచ్చే మార్గం చూడాలని పలుమార్లు కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆ మంత్రి కుటుంబీకులు అధికారులతో సంప్రదింపులు జరుపుతుండడం గమనార్హం.


హైదరాబాద్‌ సిటీ : ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే దారిలో బహుళ అంతస్తుల భవనం కోసం జీహెచ్‌ఎంసీకి ఓ నిర్మాణ సంస్థ 2019 మార్చి 26న దరఖాస్తు చేసింది. వాస్తవంగా 4 వేల చ.మీ.లకుపైగా స్థలం ఉన్నప్పటికీ రోడ్డు విస్తరణ కోసం దాదాపు 1000 చ.మీ.ల మేర స్థలం వదలాల్సి వస్తోంది. దీంతో 3,282 చ.మీ.ల స్థలంలో 10వేల చ.మీ.ల నిర్మాణ విస్తీర్ణంతో భవనం ప్లాన్‌ సమర్పించారు. అదనపు సెట్‌ బ్యాక్‌ల మినహాయింపు కోసం నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు అదే ఏడాది జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి ఫైల్‌ పంపింది. దాదాపు రెండేళ్లకు జూలై 9, 2021న సర్కారు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఆగస్టు 28, 2021న జరిగిన మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్‌(ఎంఎస్‌బీ) కమిటీ సమావేశంలో ఫైల్‌పై చర్చించిన సభ్యులు ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌(టీఐఏ) సర్టిఫికెట్‌ సమర్పించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.


యూఎల్‌సీ క్రమబద్ధీకరణ ప్రతులు దరఖాస్తుతోపాటు సమర్పించడంతో స్పష్టత కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు మేడ్చల్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. అక్టోబర్‌ 21న ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఎన్‌వోసీ అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ షార్ట్‌ఫాల్‌ నోటీస్‌ పంపింది. దరఖాస్తు పరిశీలనలో ఉండగానే నిర్మాణదారులు పనులు ప్రారంభించారు. మూడు సెల్లార్ల కోసం తవ్వకాలు పూర్తి చేశారు. సెల్లార్ల సంఖ్యను బట్టి రెండు, మూడు అంతకంటే ఎక్కువ మీటర్లు సెట్‌ బ్యాక్‌లు వదలాల్సి ఉండగా, అది కూడా పట్టించుకోలేదు. పిల్లర్లు నిర్మించి శ్లాబ్‌ నిర్మాణం కోసం సెంట్రింగ్‌ వేశారు. అనుమతులు రాకుండానే పనులు ప్రారంభంపై ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు పనులు నిలిపివేయించారు. తూతూ మంత్రంగా కొంత మేర సెంట్రింగ్‌ తొలగించారు.


జంక్షన్‌లో బహుళ వంతెనలు

ఉప్పల్‌ చౌరస్తాలో పలు వంతెనల నిర్మాణ ప్రతిపాదనలున్నాయి. నారపల్లి నుంచి రామంతాపూర్‌ మోడ్రన్‌ బేకరీ వరకు మెట్రో కారిడార్‌పై నుంచి ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే జంక్షన్‌లో స్కై వాక్‌ నిర్మాణం మొదలైంది. సికింద్రాబాద్‌- నాగోల్‌- సికింద్రాబాద్‌ మార్గంలో మినీ ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఈ క్రమంలో జంక్షన్‌లో ఆస్తుల సేకరణ అవసరముంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ దరఖాస్తు రాగానే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అప్పటి ఎస్‌ఆర్‌డీపీ చీఫ్‌ ఇంజనీర్‌ అభిప్రాయం కోరినట్టు తెలిసింది. అయితే ఎలాంటి అనుమతి రాక ముందే ఆగమేఘాల మీద నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరమేముంది..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


ఆ మార్గంలో జామ్‌జాటం..

బహుళ అంతస్తులు నిర్మిస్తున్న స్థలం ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉందనే వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ మాల్‌, మల్టీప్లెక్స్‌ నిర్మిస్తే వాహనాల రాకపోకలు అధికమవుతాయి. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఈ క్రమంలో టీఐఏ నిరభ్యంతర పత్రం ఇచ్చే అవకాశముంటుందా..? అధికార బలంతో తీసుకుంటారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-12-17T16:26:17+05:30 IST