పారిశుధ్యం, తాగునీరు అధ్వానం

ABN , First Publish Date - 2021-04-16T06:21:47+05:30 IST

పట్టణంలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ అధ్వా నంగా ఉందని మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుధ్యం, తాగునీరు అధ్వానం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత

కొవ్వూరు మున్సిపల్‌ సమావేశంలో మంత్రి ఆగ్రహం



కొవ్వూరు, ఏప్రిల్‌ 15: పట్టణంలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ అధ్వా నంగా ఉందని మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన గురువారం జరిగిన  పురపాలక సంఘ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పారిశుధ్యం, తాగునీటి నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తన ఇంటి సమీపంలోనే వీధి దీపాల నిర్వహణ లేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఖాళీ స్థలాలలో  పిచ్చిమొక్కలు పెరిగి పాములు, విష పురుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, బాధ్యతగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కౌన్పిలర్లు క్షేత్రస్థాయిలో పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రెయిన్ల సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషిచేయాలన్నారు. వేసవి వచ్చినా తాగునీటి కార్యాచరణ సిద్ధం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.


కౌన్సిలర్లు సూరపనేని చిన్ని, కంఠమని రమేష్‌బాబు అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణంలో 348 మంది ధరఖాస్తు చేస్తే కేవలం 14 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారన్నారు.  తాగునీరు, పారిశుధ్య నిర్వహణ తీరుపై మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. కౌన్సిలర్‌ సఖినేటిపల్లి చాందిని మాట్లాడుతూ నందమూరు రోడ్‌లో మురుగు డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్తాపన చేసి ఏడాది పూర్తికావస్తున్న పనులు చేపట్టలేదన్నారు. పతివాడ నాగమణి మాట్లాడుతూ పట్టణంలో దోమలు, కుక్కలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ అధికారుల అలసత్వంతో గౌతమీనగర్‌లో కల్వర్టు నాలుగున్నర అడుగుల ఎత్తులో కట్టి రోడ్డును పాడుచేశారన్నారు. కాటన్‌ విగ్రహం వద్ద చెత్త తగలబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కండెల్లి రామారావు మాట్లాడుతూ ఔరంగాబాద్‌లో పైపులైను లీక్‌, వేములూరు వైపువచ్చే మేజర్‌ డ్రైను పుడిక తీయడం లేదని ఫిర్యాదుచేసి నెల రోజులు అయిన పట్టించుకోవడం లేదన్నారు.


కమిషనర్‌ కెటి.సుధాకర్‌ మాట్లాడుతూ పట్టణంలో మేజర్‌ డ్రెయిన్లలో పూడిక తొలగించేందుకు సుమారు రూ.9.5 లక్షలతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్‌ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదన్నారు. డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి మండలంలో  స్థలం గుర్తించి అనుమతుల కొరకు జిల్లాకలెక్టరుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిషష్కారంలో టౌన్‌ప్లానింగ్‌, సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీల మధ్య సమన్వయ లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ముందుగా కాంట్రాక్టు కమిటి, ప్యానల్‌ కమిటి, తాత్కాలిక చైర్‌పర్సన్‌ ప్యానల్‌ కమిటీలను ఆమోదించారు. ప్రతినెల 27న మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలియజేసింది. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ మన్నెపద్మ, 23 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-04-16T06:21:47+05:30 IST