రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-05-28T11:06:46+05:30 IST

రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల

రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి

మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మానకొండూర్‌ నియోజకవర్గస్థాయి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల పంటలనే సాగు చేయాలని అన్నారు.  రైతులు సాగు చేయాల్సిన పంటలు వాటి మార్కెటింగ్‌, డిమాండ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు మంత్రి వివరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని స్పష్టంచేశారు. లాభసాటి పంటలతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేద్దామన్నారు. సన్న, పొడవు రకాల వరి, పత్తి, కంది పంటలకు ప్రపంచ వ్యాప్తంగా బాగా డిమాండ్‌ ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ కె శశాంక మాట్లాడుతూ ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చెప్పినట్లు పంటలు వేయాలన్నారు. మానకొండూర్‌, తిమ్మాపూర్‌ కూరగాయల సాగులో మంచి స్థానంలో పేరు పొందాయన్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, వ్యవసాయాధికారి శ్రీధర్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T11:06:46+05:30 IST