Abn logo
Sep 25 2021 @ 11:11AM

వైరల్ జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్: Harishrao

సిద్దిపేట: పట్టణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని...వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. శనివారం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా భాగస్వామ్యంతో మున్సిపాలిటీలలోనీ అన్ని వార్డులలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ జరగాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్‌లు, కమీషనర్‌లు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌లో భాగస్వామ్యమై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.


సోమవారం నుంచి అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్‌గా డ్రైవ్ చేపట్టాలని మంత్రి సూచించారు. వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఆంటీ లార్వా ఆపరేషన్‌లు చేపట్టి దోమల వృద్ధిని నియంత్రించాలన్నారు. దోమల నివారణ, లార్వా వృద్ధిని అరికట్టేందుకు పట్టణాలలోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్‌ను వేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. 

ఇవి కూడా చదవండిImage Caption