తిరుమలలో మంత్రి హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-08-16T07:40:50+05:30 IST

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కిటకిటలాడుతోంది.

తిరుమలలో మంత్రి హల్‌చల్‌

  • 40 మంది అనుచరులకు బ్రేక్‌ దర్శనం
  • 11 మందికి సుప్రభాత సేవ టికెట్లు
  • సాధారణ భక్తులను నిలిపివేసి మరీ
  • ఉష శ్రీచరణ్‌ అనుచరులకు అవకాశం
  • టీటీడీ అధికారులపై తీవ్ర ఒత్తిడి

తిరుమల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 30 నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే, రాష్ట్ర మంత్రులు మాత్రం మందీమార్బలంతో ఆలయంలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ నెల 13న ఓసారి శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌ రెండురోజుల వ్యవధిలోనే మరోసారి సోమవారం తిరుమలకు వచ్చారు. శనివారం కుటుంబసభ్యులతో వెంకన్నను దర్శించుకున్న మంత్రి, సోమవారం తన వెంట 40 మంది అనుచరులను తీసుకువచ్చారు.


వారందరికీ వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాల్సిందేనంటూ.. టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. మంత్రి ఆదేశాలకు తలొగ్గిన అధికారులు అందరికీ వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కల్పించారు. అలాగే మరో 11 సుప్రభాత సేవ టికెట్లను కూడా మంత్రి అనుచరులు తీసుకున్నట్టు సమాచారం. స్వామి దర్శనం కోసం సాధారణ భక్తులు రోజుల తరబడి క్యూలైన్‌లో కష్టాలు పడుతుంటే మంత్రి మాత్రం మందీమార్బలంతో ఇలా హల్‌చల్‌ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ అంశంపై మంత్రి ఉష శ్రీచరణ్‌ను ప్రశ్నించిన పాత్రికేయులను ఆమె భద్రతా సిబ్బంది నెట్టివేశారు. అయితే, కొద్దిసేపటి తర్వాత మంత్రి ఉష శ్రీచరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా దూరం నుంచి వచ్చారు. అందుకే వారికి దర్శన భాగ్యం కల్పిస్తే బాగుంటుందని భావించాం’ అంటూ వెళ్లిపోయారు. 

Updated Date - 2022-08-16T07:40:50+05:30 IST