కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకుల ముందే టైగర్లు !

ABN , First Publish Date - 2020-10-13T10:01:56+05:30 IST

రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకుల ముందే టైగర్లు అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో బాధ్యత మరిచిపోయి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా

కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకుల ముందే టైగర్లు !

ఓట్ల లెక్క నాడు యెల్లెలకల పడతరు

దుబ్బాకలోనూ నిజామాబాద్‌ ఫలితమే: మంత్రి హరీశ్‌

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేత నాగేశ్వర్‌రెడ్డి


హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకుల ముందే టైగర్లు అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో బాధ్యత మరిచిపోయి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎం.నాగేశ్వర్‌రెడ్డి  తన అనుచరులతో కలిసి సోమవారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హరీశ్‌రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించటమే కాంగ్రెస్‌, బీజేపీ పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. చివరికి ఓట్ల లెక్కింపు నాడు ఆ రెండు పార్టీలు యెల్లెలకల పడుతుంటాయని అన్నారు. ఫార్మా సిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశగా ఎదురుచూస్తుంటే, దానిని అడ్డుకుంటామంటూ భట్టి మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.


మొన్నటిదాకా తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పి, కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలకు తాగటానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రె్‌సపై ప్రజలకే కాకుండా, ఆ పార్టీ కార్యకర్తలకూ విశ్వాసం లేదన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ ఇప్పటికే ఖాళీ అయిందని, బీజేపీది అదే పరిస్థితి అని చెప్పారు. తాము ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి వంద ఉన్నాయని.. బీజేపీ, కాంగ్రెస్‌ ఏం చేశాయో ఒక్కటైనా చెప్పగలరా? అని ఆ పార్టీల నేతలను సవాల్‌  చేశారు. తన సిట్టింగ్‌ స్థానమైన హుజూర్‌నగర్‌లో కాంగ్రె్‌సను గెలుపించు కోలేకపోయిన ఉత్తమ్‌.. దుబ్బాకలో గెలిపిస్తారా? అని ప్రశ్నించారు. నిన్న హుజూర్‌నగర్‌, నేడు నిజామాబాద్‌లో జరిగినట్టే.. రేపు దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలవబోతోందని చెప్పారు.

Updated Date - 2020-10-13T10:01:56+05:30 IST