దళిత బంధు ఆపింది బీజేపీనే

ABN , First Publish Date - 2021-10-23T07:58:23+05:30 IST

దళితబంధు పథకాన్ని ఆపలేదన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అక్టోబరు 7న బీజేపీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎందుకు లేఖ రాశారని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఆ లేఖ మీదనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం..

దళిత బంధు ఆపింది బీజేపీనే

  • ప్రేమేందర్‌రెడ్డి ఈసీఐకి ఎందుకు లేఖ రాశారు
  • బీజేపీ ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు: హరీశ్‌ రావు


హుజూరాబాద్‌/హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌, అక్టోబరు 22: దళితబంధు పథకాన్ని ఆపలేదన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అక్టోబరు 7న బీజేపీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎందుకు లేఖ రాశారని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఆ లేఖ మీదనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరిందని చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘‘ఏడేళ్ల క్రితం మీరు ఏం చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెచ్చి, ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గిస్తామని చెప్పారు. రాష్ట్రానికో ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను నమ్మించడానికి ఏవేవో చెప్పాల్సి వస్తుందని కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ స్వయంగా ఒప్పుకొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌.. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఇంజెక్షన్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు ఇవ్వడం లేదని మాట్లాడింది నిజం కాదా..? కేబినెట్‌ హోదాలో ఉన్న మంత్రి కిషన్‌రెడ్డి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడమే కారణమని అబద్ధాలు చెప్పడం దారుణం.


కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ మీద బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీతో పాటు, రోడ్‌ సెస్‌, సర్‌ చార్జీ విధిస్తోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లీటర్‌ పెట్రోల్‌పై పన్ను రూ.10.40 ఉండేది, ఇవాళ రూ.32.90 వేస్తున్నారు. కేంద్రానికి పెట్రోల్‌, డీజిల్‌ మీద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.99.68వేల కోట్లు ఆదాయం వచ్చింది. కేంద్రం వేసిన పన్నుల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. బీజేపీ నాయకులకు ప్రజల మీద ప్రేమ ఉంటే ధరలు తగ్గించండి. మహిళా సంఘాలకు చెల్లని చెక్కులు ఇచ్చారని ఈటల రాజేందర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. పండుగ ముందే రూ.25.69 లక్షల కోట్లు వడ్డీ లేని రుణం వారి ఖాతాలో వేశాం. వచ్చే నెల 4న దళిత బంధు యూనిట్లు గ్రౌండ్‌ చేస్తాం. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆపింది బీజేపీ నాయకులే’’ అని హరీశ్‌ విమర్శించారు.


ఈటలపై సీఈవోకు ఫిర్యాదు

హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓటర్ల పేరిట బ్యాంకు ఖాతాలను తెరిచి, అందులో ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు జమచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు సీఈవోకు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2021-10-23T07:58:23+05:30 IST