Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం శంకుస్థాపన

  • హైదరాబాద్‌ నలువైపులా నిర్మాణం
  • వరంగల్‌ ఆస్పత్రికి నెలాఖరులోగా టెండర్లు: మంత్రి హరీశ్‌


హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నలువైపులా నిర్మించతలపెట్టిన నాలుగు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రూ.1100 కోట్లతో నిర్మాణానికి పరిపాలన అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య విద్య కళాశాలలు, మల్టీ సూపర్‌ సెష్పాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై సోమవారం బీఆర్కే భవన్‌లో వైద్యఆరోగ్య, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలని సూచించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సంబంధించి నమూనాలను మంత్రి పరిశీలించారు.    


టిమ్స్‌లలో ఎయిమ్స్‌ తరహా సేవలు

హైదరాబాద్‌ నలువైపులా గచ్చిబౌలి, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆస్పత్రుల ఏర్పాటుకు సన్నాహకాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ సేవలు ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో వీటిని నిర్మించనున్నట్లు వెల్లడించారు.  


పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో కార్మికులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం రూ.150 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలోని 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు.  

Advertisement
Advertisement