యాదాద్రి ఆల‌య‌ పనుల పురోగ‌తిలో వేగం పెంచండి

ABN , First Publish Date - 2021-12-16T22:37:06+05:30 IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

యాదాద్రి ఆల‌య‌ పనుల పురోగ‌తిలో వేగం పెంచండి

హైద‌రాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ  పనులన్నీ వేగంగా  పూర్తి చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో ఆల‌య ప‌నుల పురోగ‌తి, మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ  ఏర్పాట్ల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.  


అర‌ణ్య భ‌వ‌న్ లో నిర్వ‌హించిన‌ ఈ సమావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఈవో గీతారెడ్డి,అర్కిటెక్ట్ ఆనంద్ సాయి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు , క‌ళ్యాణ క‌ట్ట‌, దీక్షాప‌రులు మండ‌పం, అన్నప్రసాదం, వ్ర‌త మండ‌పం, గండి చెరువు సుంద‌రీక‌ర‌ణ,బస్ ట‌ర్మిన‌ల్స్, త‌దిత‌ర నిర్మాణాల పురోగతిపై మంత్రి  చర్చించారు. 


మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మ‌హా సుద‌ర్శ‌న యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్య‌క్ర‌మాల ఏర్పాట్లు,  యాగ‌శాలల నిర్మాణం, రుత్వికుల‌కు బ‌స చేసేందుకు విడిది, త‌దిత‌ర ఏర్పాట్ల‌పై మంత్రి ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల తీరుపై  క్షేత్రస్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించుకుంటూ స‌కాలంలో ప‌నులన్ని పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. 



ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తజన సందోహం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నయాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని, దాదాపుగా అన్ని ప‌నులు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయ‌ని, ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని ప‌నులను ఫిబ్ర‌వ‌రి లోపు పూర్త‌యేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సకల హంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు  విమాన గోపుర బంగారు తాప‌డానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వ‌స్తున్నార‌న్నారు. 

Updated Date - 2021-12-16T22:37:06+05:30 IST