Abn logo
Oct 29 2020 @ 01:18AM

కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్మాలి

Kaakateeya

మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 28: కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని విక్రయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ వానకాలం సీజన్లో పంటలు సమృద్ధిగా పండాయని, అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురి చేశాయని పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రంగు మారిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవాలన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు జరిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, మార్కెట్‌ చైర్మన్‌ బర్మావత్‌ రమ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


మిల్లర్లు సమస్యలు సృష్టించవద్దు

జమ్మికుంట: ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు సృష్టించవద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆన్నారు. బుధవారం పట్టణంలోని ఆయ్యప్పస్వామి ఆలయం, పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డు, జగ్గయ్యపల్లి గ్రామాల్లో జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం చైర్మన్‌ పొనగంటి సంపత్‌ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని దింపుకోవడంలో గతంలో కొంత మంది మిల్లర్లు కొర్రీలు పెట్టారని, ఈ సారి ఆలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు బాగుంటనే అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రైతులు నేరుగా కళ్లాల వద్ద నుంచే కాకుండా, ఽఇంటి వద్దనే ధాన్యం ఆరబెట్టుకోని తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు రావాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టడం వల్ల ఆలస్యం అవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.


ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, జడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరాం శ్యామ్‌, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి, తహసీల్దార్‌ కన్నం నారాయణ, పీఏసీఎస్‌ సీఈవో ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement