మద్దతు ధరతో ధాన్యాన్ని కొంటాం

ABN , First Publish Date - 2020-10-30T11:04:52+05:30 IST

భుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పండించిన పంటలను మద్దతు ధరతో కొంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

మద్దతు ధరతో ధాన్యాన్ని కొంటాం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 29: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పండించిన పంటలను మద్దతు ధరతో కొంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను చూసి రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని సూచించారు. రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేలా ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరిపిందన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని సూచించారు. రైతు వేదికల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాధి ప్రభావం కాస్తా తగ్గినా చలికాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సర్పంచ్‌ కోడిగూటి శారద, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, చొల్లేటి కిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, అనుమాండ్ల శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.


పోచమ్మ తల్లికి పూజలు

మండలంలోని పోతిరెడ్డిపేటలో నెలకొల్పిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన  కార్యక్రమానికి గురువారం మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోచమ్మ తల్లికి, భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు

ఇల్లందకుంట: వరిధాన్యం కొనుగోళ్లలో మిల్లర్స్‌ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం మండలంలోని బూజూనూర్‌, సీతంపేట, టేకుర్తి, సిరిసేడు, ఇల్లందకుంట, మల్యాల, లక్ష్మాజిపల్లె, కనగర్తి తదితర గ్రామాల్లో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనూకూలంగా సన్న వడ్లు వేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సన్నరకం పంట వేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ సరిగోమ్ముల పావని-వెంకటేష్‌, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, తహసీల్దార్‌ సురేఖ, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు అయిలయ్య, సర్పంచ్‌లు అరుణ, వనమాల, వెంకటస్వామి, రఫీఖాన్‌, శ్రీలత, సింగిల్‌ విండో చైర్మన్లు, సీఈవోలు శ్రీనివాస్‌, ఆదిత్య, దేవేందర్‌, సత్యనారాయణరెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:04:52+05:30 IST